సాక్షి ప్రతినిధి, కర్నూలు: బడికి వెళ్లక్కరలేదు.. పాఠాలు వినాల్సిన అవసరం లేదు..డబ్బిస్తేఎంచక్కా మీరు ఆ పాఠశాలలో చదివినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తున్నారు. ఇందుకు విద్యాశాఖలో కొందరు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. గురువారం ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిపై కర్నూలు విద్యాశాఖ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. డీఈవో నాగేశ్వరరావు స్వయంగా ఈ విచారణలో పాల్గొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..ఎమ్మిగనూరు పరిధిలోని నవోదయ పాఠశాలలో తమ చిన్నారులకు సీటు సంపాదించుకోవాటానికి అనేక మంది పోటీ పడుతున్నారు. రూరల్ పరిధిలో చదుకునేవారికి 70శాతం రిజర్వేషన్ ఉంది.
దీంతో అనేక మంది పట్టణ వాసులు రూరల్‌లో చదువుకున్నట్లు స్టడీ సర్టిఫికెట్స్ కోసం స్థానిక పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అవసరాలను గుర్తించిన కొందరు ప్రధానోపాధ్యాయులు బోగస్ సర్టిఫికెట్స్ ఇచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. విషయాన్ని గమనించిన మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామానికి చెందిన కె. రాగన్నశెట్టి ఈ అక్రమాలను బయటపెట్టాలని తలంచాడు.
తన కుమారుడు కర్ణాటకలో చదువుతున్నాడని, వాడు ఇక్కడే చదివినట్లు సర్టిఫికెట్ ఇవ్వమని చిలకలడోణలోని మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని కలిశారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు రూ.500 తీసుకుని ఆ పాఠశాలలో 1999 నవంబర్‌లో ఐదో తరగతి పూర్తి చేసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దానిపై వేసిన అడ్మిషన్ నంబర్ ప్రకారం అదే తేదీన ఎవరు సర్టిఫికెట్ పొందారో తెలుసుకునేందుకు ఆయన సమాచార హక్కుచట్టాన్ని ఆశ్రయించారు. ఇదే నంబర్‌పై గోనె భీమన్న అనే విద్యార్థి 1997 ఏప్రిల్ 24న ఐదో తరగతి పూర్తి చేసుకున్నట్లు తెలిసింది.
ఆ వివరాలను తీసుకుని అప్పటి జిల్లా విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై డిప్యూటీ డీఈఓ మూడు పర్యాయాలు ఆ పాఠశాలకు వెళ్లి విచారించినట్లు కె. రాగన్నశెట్టికి వివరణ పంపారు. అందులో ఫిర్యాదు దారుడితే తప్పని తేల్చారు. అఆగే కె. రాగన్నశెట్టిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆయన కలెక్టర్, ఆర్‌జేడీ (కడప), డెరైక్టర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ, సమాచారశాఖ కమిషనర్‌ను ఆశ్రయించారు. అలాగే తనకు తప్పుడు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుడు పీటర్.. 2001 జూన్‌లో రిటైర్‌మెంట్ తీసుకుని ప్రస్తుతం ప్రకాశం జిల్లా గిద్దలూరు ఉపఖజానా కార్యాలయం ద్వారా పెన్షన్ పొందుతున్నట్లు ఆధారాలు సంపాదించారు.
ఈ వివరాలతో లోకాయుక్తను ఆశ్రయించారు. వారి ఆదేశాల మేరకు గురువారం డీఈవో కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు దారుడు ఇచ్చిన ఆధారాలను, అధికారులు ఇచ్చిన వివరాలను డీఈఓ నాగేశ్వరరావు పరిశీలించారు. విచారణ పూర్తి కావాటానికి మరి కొంత సమయం పడుతుందని తెలిపారు.
పత్రం..అక్రమం!
Published Fri, Nov 29 2013 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM
Advertisement
Advertisement