బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్న నేపధ్యంలో ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
విశాఖపట్నం : బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్న నేపధ్యంలో ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 5,00,419 మంది విద్యార్థులు హాజరవుతారని, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,93,472 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1363 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్, అమరావతి నగరాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురైనా టోల్ ఫ్రీ నంబరు 18002702701కు ఫోన్ చేయాల్సిందిగా కోరారు.117 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, ఆయా కేంద్రాలలో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారని, మాస్ కాపీయింగ్ జరుగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.