అనంతపురం సెంట్రల్ : స్వయం సహాయక సంఘాల మహిళలకు చెందిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. రూ. లక్షల్లో దుర్వినియోగం చేస్తున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. డీఆర్‌డీఏ- వెలుగుకు కొన్ని నెలలుగా రెగ్యులర్ ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) లేకపోవడంతో కొంతమంది అధికారులకు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైంది. పొదుపు మహిళల సొమ్మును భద్రంగా ఉంచాల్సిన జిల్లా సమాఖ్య కార్యాలయంలోనే ఇష్టారాజ్యం తయారైంది.
ఎంతకు పడితే అంతకు బిల్లు పెట్టుకోవడం, జిల్లా సమాఖ్య నుంచి డ్రా చేసుకోవడం పరిపాటిగా మారింది. డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో పాటు మహిళల పొదుపు సొమ్ముపై వచ్చే వడ్డీని కూడా ఖర్చు చేస్తున్నారు. కొంతమంది అధికారులు, జిల్లా సమాఖ్య లీడర్లు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షురాలు, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీలు ఏ సమావేశానికి వచ్చినా టీఏ, డీఏలు జిల్లా సమాఖ్యే భరిస్తుంది. బస్సు టికెట్‌తో పాటు రోజుకు రూ.150 భోజన నిమిత్తం చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. అయితే.. గతంలో ఎప్పుడూ రూ. 8 వేల నుంచి రూ.10 వేలకు మించని ఈ ఖర్చు ప్రస్తుతం ప్రతినెలా రూ.18 వేల నుంచి రూ.20 వేలు అవుతోంది. ఏ పని మీద వచ్చినా జిల్లాసమాఖ్యలో టీఏ,డీఏలు డ్రా చేస్తున్నారు.
ఇటీవల ఆర్‌టీసీ సమ్మె సమయంలో జిల్లా కేంద్రానికి రావడానికి ఓ ప్రైవేటు వాహనాన్ని తీసుకున్నారు. దీని కోసం రూ.వేలల్లో బిల్లు చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం వాహనాలు తీసుకునేందుకు అవకాశం లేదు. ఇక ఎనిమిది నెలల వ్యవధిలోనే రూ.1.50 లక్షకు పైగా టీఏ, డీఏలకు చెల్లించారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జిల్లా సమాఖ్యలో సమావేశముందంటే అక్కడ పనిచేస్తున్న అధికారులు, కొంతమంది లీడర్లకు పండగే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిన్నపాటి సమావేశానికి రూ.60 వేలకు పైగా డ్రా చేశారు.
ఒక షామియానా, 30-40 కుర్చీలు తప్పా ఏవీ తెప్పించిన దాఖలాలు లేవు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే ‘స్పెషల్ భోజనం తెప్పించామ’ని అంటున్నారు. సమావేశాలు, లీడర్లు రానుపోను చార్జీలు, వారికి భోజనాలు కలిపి నెలకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ ఖర్చు చేస్తున్నారు. ఈ భారమంతా డ్వాక్రా మహిళలపై మోపుతున్నారు. పేద మహిళలు కష్టార్జితంతో దాచుకున్న సొమ్ముకు ప్రతిఫలంగా వచ్చే నిధులను ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఖర్చు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియో కాన్ఫరెన్స్‌లు అధికమయ్యాయి : చంద్రమౌళి, మేనేజర్, జిల్లా సమాఖ్య
గతంలో 15 రోజులకు మించి ఎక్కువ టూర్ ఉండకూడదని నిబంధనలున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో ఇసుకరీచ్‌లు, ఇతర కార్యక్రమాలపై ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. దీనికితోడు రీసోర్సు ఫీజును పెంచారు. దీనివల్ల ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. టూర్‌లు తగ్గించాలని ప్రాజెక్టు డెరైక్టర్‌కు లేఖ రాశాం. జిల్లా సమాఖ్యకు పెద్దగా నిధులు వస్తున్న దాఖలాలు లేవు. దీనివల్ల ఖర్చులు కూడా పెద్దగా పెట్టడం లేదు. తప్పనిసరి అయితేనే ఖర్చు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆడిట్ ఉంటుంది. అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి.
ఇష్టారాజ్యం
Published Sat, Jun 20 2015 3:44 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM
Advertisement
Advertisement