ఎంపీగా పోటీ చేయాలని ఉంది: జేసీ
అనంతపురం : వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని ఉందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తన మనసులో మాటను మరోసారి బయటపెట్టారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పలేనని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనకు తెలుగు దేశం పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని జేసీ తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేసీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్కు వెళ్లే యోచనలో ఉన్నారు.
అనంతపురం జిల్లాలో ఎదురులేని నేతగా పేరుపొందిన జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మంత్రిగా కూడా పని చేశారు. అయితే కొంతకాలంగా జేసీకి సొంత ఇలాకాలోనే పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.మంత్రి రఘువీరారెడ్డితో ప్రచ్చన్నంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా గతంలో జేసీ కుటుంబం రాకను స్వాగతించారు.మరి వచ్చే ఎన్నికల్లో జేసీ సైకిల్ ఎక్కుతారా లేదా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.