విజయవాడ కనక దుర్గమ్మ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. మధ్యాహ్నాం 1.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతితో దసరా ఉత్సవాల ముగింపు ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారి అంతరాలయ దర్శనం, ఆశీర్వచనాలు నిలిపేశారు.
ఆలయంలో భక్తులకు లఘు దర్శనానికి మాత్రం అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్లకు హంస వాహనంపై ఊరేగించనున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిని భారీ సంఖ్యలో భవానీ దీక్ష చేసే వారు దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కొండ కింద దీక్షలు విరమిస్తున్నారు. భవానీల కోసం ప్రత్యేకంగా హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల నుంచి భవానీలు వస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment