
బాధను చెప్పుకున్న మహిళలను ఓదార్చుతున్న లావు శ్రీకృష్ణదేవరాయలు, కాసు
గుంటూరు, పిడుగురాళ్ల రూరల్ : ‘‘పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే జన్మభూమి కమిటీ సభ్యుల సంతకం పెట్టించుకోమని మెలిక పెడతారు. సొంత ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్న తమకు ఇళ్లు మంజూరు చేయమంటే టీడీపీకి ఓటు వేయాలని బెదిరిస్తున్నారు. కనీసం ఇంటి స్థలం మంజూరు చేయమన్నా మీరు వైఎస్సార్ సీపీ వాళ్లు కాబట్టి ఇవ్వబోమని మొహం మీదే చెబుతున్నారు.. ఇటువంటి దుర్మార్గమైన టీడీపీ ప్రభుత్వం దిగిపోవాలయ్యా.. జగన్ వస్తే మా కష్టలు తీరుతాయనే నమ్మకం మాకు ఉంది’’ అంటూ పలువురు మహిళలు, యువకులు వైఎస్సార్ సీపీ నేతల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పిడుగురాళ్ల మండలం అంజనీపురం, తుమ్మలపురం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి చేపట్టిన అదేబాట పాదయాత్ర జరిగింది.
ఈ సందర్భంగా కాసు మహేష్‌రెడ్డి, పార్టీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు వద్ద పేదలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఒక్క పథకం కూడా తీసుకోలేదని, ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ, ఎమ్మెల్యే దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోమంటున్నారని మహిళలు వాపోయారు. ఈ కష్టాలను భరించే ఓర్పు, సహనం మాకు లేదని, జగనన్న సీఎం అయితే మా జీవితాలు బాగుపడతాయని చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని, కానీ ఇంత వరకు మాకు ఉద్యోగం ఇవ్వలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను చంద్రబాబు ఇంతలా మోసం చేస్తాడని ఊహించలేదని, చంద్రబాబు పోతేనే మాకు జాబ్‌లు వస్తాయని వారు తెలిపారు. మహిళలు, యువకుల సమస్యలను విన్న శ్రీకృష్ణదేవరాయలు, కాసు మరో నాలుగు నెలలు ఓపిక పడితే మీరు అడిగినవన్ని, అడగనివి కూడా చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. నేతలు ఎనుముల మురళీధర్‌రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, చింతా సుబ్బారెడ్డి, దొడ్డా అంజిరెడ్డి, షేక్ దస్తగిరి తదితరులున్నారు.
వైఎస్సార్ విగ్రహావిష్కరణ : తుమ్మలచెరువు గ్రామానికి చెందిన గున్నమరెడ్డి మదన్ మోహన్‌రెడ్డి కుమారుడు ఉమమహేశ్వరరెడ్డి(ఎన్‌ఆర్‌ఐ) ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని లావు, కాసు ఆవిష్కరించారు. అయ్యప్పనగర్‌లో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేశారు. పార్టీ మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వీరభద్రుని రామిరెడ్డి, నేతలు జాలిరెడ్డి, వాసుదేవరెడ్డి, కుమారి ఏలియా పాల్గొన్నారు.
బురిడి బాబును సాగనంపుదాం :వైఎస్సార్ సీపీ నేత కృష్ణదేవరాయలు
పిడుగురాళ్ల రూరల్ : అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను నాలుగున్నరేళ్లుగా మోసం చేస్తున్న బురిడి బాబును సాగనంపే రోజులు దగ్గర్లో పడ్డాయని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త లావు కృష్ణదేవరాయలు అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి చేపడుతున్న అదేబాట పాదయాత్ర శుక్రవారం మండలంలోని తుమ్మల చెరువు గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ తెలంగాణాలోనే కాదు ఏపీలో కూడా బురిడి బాబును త్వరగా ఇంటికి పంపాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.
దద్దమ్మ ప్రభుత్వాన్ని తరిమికొడదాం : కాసు
నాగార్జున సాగర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా రైతులకు సాగునీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీది అని నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం చేతగాదు కాని పేకాట క్లబ్‌లు మాత్రం ఏర్పాటు చేస్తారని విమర్శించారు. పల్నాడులో మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేయడం చేతగాదు గాని సున్నపు గనులు దోచుకోవడం యరపతినేనికి వచ్చునని అన్నారు. గ్రామాల్లో మద్యం 24 గంటలు అందుబాటులో ఉంటుంది కాని మంచినీళ్లు మాత్రం దొరకకపోవడం దారుణమన్నారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ముస్లింల అభివృద్ధికి నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి, వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడ్డారన్నారు. కాని నేటి టీడీపీ ప్రభుత్వం ముస్లింలను విస్మరించిందన్నారు.