కేసీఆర్ వెన్నుపోటు పొడిచారు: రాహుల్ గాంధీ
కేసీఆర్ వెన్నుపోటు పొడిచారు: రాహుల్ గాంధీ
Published Mon, Apr 21 2014 6:38 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
డిచ్ పల్లి: టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వెన్నుపోటు దారుడని నిజమాబాద్ జిల్లా డిచ్ పల్లిలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఇరుసభల్లో బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత ఓ నాయకుడు తన ఇంటికి వచ్చి కలిశారని కేసీఆర్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన ఇంటికి వచ్చి కలిసిన ఆయన 'నీతో ఉంటాను' అని అన్నారు. నేను తెలంగాణ అభివృద్ది గురించి మాట్లాడుతుంటే.. 'ఆయన మళ్లీ ఏది ఏమైనా నీతోనే ఉంటాను' అని అన్నారని రాహుల్ తెలిపారు.
తనతో సమావేశం అనంతరం వరండాలోకి వచ్చిన ఆయన మరోసారి ఎలాంటి పరిస్థితిలోనైనా నేను మీతోనే ఉంటాను అని మరోసారి అన్నారు. దాంతో నేను చేయి కలిపాను అని రాహుల్ తెలిపారు. అతర్వాత నిన్ను కౌగిలించుకోవాలని ఉందని ఆ వ్యక్తి తెలిపారని రాహుల్ పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సరేనని తాను కౌగింలించుకున్నాను. చేయి, కౌగిలించుకున్న తనను ఆ వ్యక్తి వెన్నుపోటు పొడిచారు అని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. అభివృద్దిలో కూడా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. యువకులు కొనుగోలు చేసే గడియారం, టీషర్టు ఇతర వస్తువుల వెనుక మేడ్ ఇన్ చైనా అని రాసి ఉంటుందని.. అయితే రాబోయే కాలంలో యువకులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు వెనుక మేడ్ ఇన్ తెలంగాణ అని రాసి ఉంటుందన్నారు. తెలంగాణకు సరిపోయే విధంగా విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా చేవెళ్ల, ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు.
Advertisement