
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే చంపేస్తారా?
పాడేరు : ప్రజా సమస్యలపై నిలదీసే నేతలను చంపేస్తారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు ప్రశ్నించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై పోరాడిన ఎమ్మెల్యే రోజాపైకి ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉసిగొల్పి చంపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకొని నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులకు ఉసిగొల్పడం అన్యాయం అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను గూండాల్లా ముఖ్యమంత్రి మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఇంత క్రూరమైన పాలన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాందోళన చెందే పరిస్థితి నెలకొందన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రోజాపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడిన సంఘటన మహిళలకే అవమానకరం అన్నారు.
టీడీపీ పాలనలో మహిళలకు, మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కరువైందని ఈ సంఘటనే రుజువు చేస్తుందన్నారు. ఆయన తీరును మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎమ్మెల్యే రోజాపై దాడికి బాధ్యత వహిస్తూ ఆమెకు చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యేలు ఈశ్వరి, సర్వేశ్వరరావులు డిమాండ్ చేశారు.