
అక్రమ కేసుల బనాయింపే బాబు లక్ష్యం
- ప్రజాపోరాటాలను అణచివేయాలని చూస్తున్నారు
- నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి
నంద్యాల: ప్రజా సమస్యలను పరిష్కరించాలని నిలదీసే వారిపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆరోపించారు. నంద్యాల పట్టణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం నాయకులు ఆదివారం.. 72గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు.
వీరికి భూమా మద్దతు తెలిపి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయన్నారు. అక్రమ కేసులతో ప్రజా పోరాటాలను అణచి వేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎల్లకాలం సాగబోవన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే ఉండబోదని, ప్రజలకు మాత్రమే తాము భయపడుతామన్న విషయం గుర్తించుకోవాలన్నారు. సీపీఎం నాయకులు కోరుతున్న విధంగా నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం రూ.350కోట్లు నిధులు మంజూరు చేయాలన్నారు.
చిత్రహింసలకు గురి చేస్తున్నారు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించారనే కసితో మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని భూమా ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను గమనించకుండా కాలుష్యానికి దూరంగా శిల్పా..బెంగళూరులో నివాసం ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండబోదని, అధికారులు తొత్తులుగా మారకుండా నిజాయితీ వ్యవహరించాలని కోరారు.నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణతో పాటు పందుల సమస్య కూడా తీవ్రంగా ఉందని గుర్తుచేశారు. రోడ్లు వెడల్పు చేయాలని చిన్నారులు సైతం ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న అవినీతి వెలుగులోకి తేవడానికి పీఏసీ చైర్మన్‌గా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో సీపీఎం నాయకుడు మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.