కోటప్పకొండ పర్యావరణ కేంద్రం అభివృద్ధికి కృషి
అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
నరసరావుపేటరూరల్: రానున్న ఐదేళ్లలో కోటప్పకొండ ఘాట్‌రోడ్డులో ఉన్న ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని వందశాతం అభివృద్ధి పరచనున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. శుక్రవారం ఆయన ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శించారు. అధికారులతో సమీక్షించారు. డీఎఫ్‌వో మోహనరావు, ఫారెస్ట్ రేంజర్ హరి, కాంట్రాక్టర్ సుధీర్‌తో కలసి పర్యావరణ కేంద్రంలో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న ఎన్‌క్లోజర్లను పరిశీలించారు. కృష్ణజింక, ముళ్లపంది, సాంబర్(దుప్పిజాతి)తో పాటు పలు రకాల పక్షుల జాతులను వైజాగ్ జూ నుంచి తీసుకురానున్న నేపథ్యంలో వాటిని ఎక్కడెక్కడ ఎన్‌క్లోజర్‌లలో ఉంచాలనేదానిపై పరిశీలన జరిపారు.
అలాగే ట్రాయ్ ట్రైన్ ఇప్పటి వరకు పర్యావరణ కేంద్రంలో అరకిలోమీటర్ వరకు ప్రయాణిస్తోంది. దీనిని కిలోమీటర్‌కు పెంచాలని నిర్ణయించారు. ట్రాయ్‌ట్రైన్ తిరిగే ప్రాంతంలో ఏర్పడిన గుంతలను రోలింగ్ చేయించి పూడ్చాలని ఆదేశించారు. పర్యావరణ కేంద్రంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలన్నారు.
నెమళ్లను ఆరుబయటకు వదిలితే సందర్శకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. కుందేళ్ల ఎన్‌క్లోజర్ వద్దకు కొండచిలువ రావడాన్ని అధికారులు ప్రస్తావించగా, జాగ్రత్తలు తీసుకోవాలని సభాపతి సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ చైర్మన్ కడియాల రమేష్, తహసీల్దార్ లీలాసంజీవకుమారి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బద్దూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.