ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. తాము ముందుగా నిర్ణయించిన మేరకు ఐదు రోజులపాటు మాత్రమే సభను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన గురువారం బీఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో వైఎస్సార్‌సీపీ తరఫున జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంతరెడ్డి, ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, బీజేపీ తరపున పి. విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.
శాసనసభ సమావేశాలను 15 రోజుల పాటు జరపాలని వైఎస్సార్‌సీఎల్పీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. బీఏసీ జరగక మునుపే అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే నిర్వహిస్తామని కొందరు మంత్రులు వెల్లడించిన విషయాన్ని జ్యోతుల నెహ్రూ స్పీకర్ దృష్టికి తెచ్చారు. మంత్రి యనమల గాని, స్పీకర్ గాని సరైన సమాధానం ఇవ్వలేదు. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు కూడా సమావేశాలను కనీసం 15 రోజులు జరపాలని సూచించారు. ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. ఐదు రోజుల పాటు 22 వరకూ జరిగే సమావేశాలను సద్వినియోగం చేసుకుంటే అన్ని అంశాలను చర్చించవచ్చన్నారు.
కాల్‌మనీ తొలి ప్రాధాన్యంగా తీసుకోండి...
కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా చర్చ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ కోరింది. తాము 344 నిబంధన కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఐతే చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు ఈ నిబంధన కింద తొలుత అధికార పక్షానికి అవకాశం వస్తుందని చెప్పారు. సీఎం జోక్యం చేసుకుని కాల్‌మనీ వ్యవహారంపై 18వ తేదీన తానే ప్రకటన చేస్తున్నానని, ప్రతిపక్షం వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పిస్తే వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
15 అంశాలపై చర్చను కోరిన విపక్షం...
కాల్‌మనీ-సెక్స్ రాకెట్, వ్యవసాయం-రైతాంగ సమస్యలు, కరవు, వరదలు, మొలకెత్తిన ధాన్యం కొనుగోళ్లు, బాక్సైట్ తవ్వకాలు, కల్తీ మద్యం మరణాలు- మద్యం విధానం, నిరుద్యోగం-భృతి, ఉద్యోగాల భర్తీ, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, కృష్ణా జలాలు, ప్రాజెక్టులు-అంచనా వ్యయం పెంపు-జీవో 22, రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ, ఇసుక అక్రమరవాణా-అధికారులపై టీడీపీ దాడులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్థానిక సంస్థలు-జన్మభూమి కమిటీలు, భూకేటాయింపులు, అంగన్‌వాడీ, వీఆర్‌ఏ-ఆశావర్కర్ల సమస్యలు, రుణాల మాఫీ వంటి అంశాలను సభలో చర్చించాలని వైఎస్సార్‌సీపీ కోరింది.