
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఇంకా సెలెక్ట్ కమిటీకి నివేదించలేదని తేటతెల్లమైంది. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న వాదన తప్పని తేలిపోయింది. ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇంకా పంపలేదని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ స్వయంగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన గురువారం తణుకులో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆ రెండు బిల్లులను ఇంకా సెలెక్ట్ కమిటీకి పంపలేదు. ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఆ ప్రక్రియ పూర్తయితేగానీ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం సాధ్యపడదు’’ అని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియ శాసనమండలిలోనే నిలిచిపోయినట్టు స్పష్టమైంది. టీడీపీ వాదనలోని డొల్లతనం బట్టబయలైంది. ఆ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి నివేదించిందని టీడీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని తేలిపోయింది.
ఈ రెండు బిల్లుల విషయంలో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారం, హడావుడిపై నిపుణులు మండిపడుతున్నారు. ‘‘ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాం.. నిర్ణయం వచ్చేందుకు ఇక మూడు నెలలు సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఇంకా పొడిగించే వీలుంది’’ అంటూ చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ప్రజల్ని తప్పుదారి పట్టించే వాదనను తెరపైకి తెచ్చారని వారు విమర్శిస్తున్నారు. శాసన మండలి చైర్మన్ ఇచ్చిన స్పష్టతతో అసలు నిజం బయటికొచ్చిందని, ఇప్పటికైనా ప్రజలను తప్పుదారి పట్టించే యత్నాలను టీడీపీ విడనాడాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ రెండు బిల్లులపై శాసనమండలి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టేనని వారు చెబుతున్నారు.