మేము సైతం...
హుదూద్ తుఫాన్ బీభత్సం కారణంగా గోదావరి జిల్లాలు, విశాఖ సహిత ఉత్తరాంధ్ర అతలా కుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రకృతి వైపరీత్యంపై సినీపరిశ్రమ అభినందనీయంగా స్పందించింది. పలువురు సినీ ప్రముఖులు మేము సైతం అంటూ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు.
బాధితుల సహాయార్థం పవన్‌కల్యాణ్ 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేయనున్నట్లు ప్రకటించారు. బాధిత ప్రాంతాలలో త్వరలోనే పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ స్పందించాలని, అభిమానులు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు.
మహేశ్‌బాబు కూడా ఈ విపత్తు విషయంలో తనదైన శైలిలో స్పందించారు. 25 లక్షల రూపాయలు బాధితుల సహాయార్థం ప్రకటించారు. జరిగిన నష్టం నుంచి త్వరగా కోలుకొని, త్వరగా ఆ ప్రాంతాలు పూర్వవైభవానికి చేరుకోవాలని మహేశ్ ఆకాంక్షించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా అభి మానులకు పిలుపునిచ్చారు.
సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ కూడా 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం అనౌన్స్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి విజయనిర్మల కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఘట్టమనేని అభిమానులు తక్షణం తుఫాన్ బాధిత ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
రామ్‌చరణ్ 15 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వాటిలో పది లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందిస్తామని, మిగిలిన అయిదు లక్షలు విశాఖకు చెందిన రామకృష్ణ మిషన్ వారికి అందిస్తామని, ఇంకా అయిదువేల పులిహోర పొట్లాలు, పదివేల వాటర్ బాటిల్స్, అయిదు వేల బిస్కెట్ ప్యాకెట్స్ అందిస్తామని రామ్‌చరణ్ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
మానవతా దృక్పథంతో అందరూ కలిసి తుఫాన్ బాధితుల్ని ఆదుకోడానికి ముందుకు రావాలని పిలుపునిస్తూ జూనియర్ ఎన్టీఆర్ 20 లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి ప్రకటించారు.
షూటింగ్ నిమిత్తం కొచ్చీలో ఉన్న అల్లు అర్జున్ కూడా తుఫాన్ బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి 20 లక్షల రూపాయిల ఆర్థిక సాయం ప్రకటించారు. తుఫాన్ కారణంగా తానెంతో ఇష్టపడే విశాఖ నగరం రూపురేఖలు మారిపోవడం తననెంతో కలచివేసిందనీ, తాను ప్రకటించిన 20 లక్షల ఆర్ధిక సాయంలో ఎక్కువ శాతం మత్స్యకారుల కుటుంబాలకే చెందాలని బన్నీ ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభాస్ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
రామ్ కూడా సీఎమ్ రిలీఫ్ ఫండ్‌కు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అందరూ కలిసి కట్టుగా ఈ విపత్తును ఎదుర్కోవాలని రామ్ పేర్కొన్నారు.
‘హృదయకాలేయం’ ఫేమ్ సంపూర్ణేశ్‌బాబు కూడా లక్ష రూపాయిలు బాధితుల సహాయార్థం అందించడం గమనార్హం. ఇంకా బియ్యం, కూరగాయలు కూడా తుఫాన్ బాధితులకు అందించనున్నట్లు చెప్పారు.
తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి కూడా మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతానికి 25 లక్షల రూపాయిలు ఇస్తున్నామని, ఇక ముందు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
3జి లవ్’ చిత్ర నిర్మాత ప్రతాప్ కొలగట్ల ఒక లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు.