క్షణికావేశంలో..
పొందూరు: క్షణికావేశం.. చిన్నచిన్న అపార్థాలకు ఓ నిండు జీవితం బలైంది. ముక్కుపచ్చలారని చిన్నారి తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనతో రెండు కుటుం బాలకు తీరని శోకం మిగిలింది. మండలంలోని అచ్చిపోలవలస గ్రామానికి చెందిన వివాహిత సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై బాలరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అచ్చిపోలవలస గ్రామంలో గోరింట జయశ్రీ(25) కొన్నాళ్లుగా నివాసం ఉంటోంది. ఆమె భర్త కృష్ణప్రసాద్ జగదల్‌పూర్‌లో రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. అక్కడి వాతావారణం సరిగ్గా ఉండదని.. కృష్ణప్రసాద్ కుటుంబాన్ని అచ్చిపోలవలసలో ఉంచాడు. ఆ విషయాన్ని భార్యకు చెప్పి ఒప్పిస్తూ వచ్చాడు. ఇటీవల గ్రూప్స్‌లో సెలెక్ట్ అవ్వడంతో శ్రీకాకుళంలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. శ్రీ కాకుళంలోనే ఉండి, చదువుకుంటూ.. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి, వెళ్తుండేవాడు.
అయితే, భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని కొన్నాళ్ల నుంచి జయశ్రీ బాధ పడుతుండేది. ఈ నేపథ్యంలో గతంలో రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించింది. సోమవారం క్షణికావేశంతో తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్సై బాలరాజు సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
పసిపాపకు దిక్కెవరు..?
కృష్ణ ప్రసాద్, జయశ్రీలకు రెండేళ్ల కుమార్తె ఉంది. తల్లి జయశ్రీ మృతి చెందడంతో ఇంక ఆ పాపకు దిక్కెవరు? అమ్మలేని లోటు తీరెదెలా? అని స్థానికులు కంట తడిపెడుతున్నారు. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు వృద్ధాప్యంలో ఉండటం.. క్షణికావేశంలో జయశ్రీ ఆత్మహత్య చేసుకోవడంతో ముక్కుపచ్చలారని చిన్నారి అనాథగా మిగిలిపోయింది. చిన్నారి అమ్మ కావాలని ఏడుస్తుండటం.. స్థానికులను కలిచివేస్తోంది.