నా భార్యను ఇండియాకు తీసుకురారూ..
Published Wed, Jan 29 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : పరాయి దేశంలో అనారోగ్యంతో బాధపడుతూ నిర్బంధం లో ఉన్న తన భార్యను స్వదేశానికి తీసుకురావాలని ఆమె భర్త పంటిల గోపి వేడుకుంటున్నాడు. వివరాలు ఇవి.. తాడేపల్లిగూడేనికి చెందిన పంటిల సత్యవతి ఉపాధి కోసం కొంతకాలం క్రితం ఖతార్ దేశానికి వెళ్లింది. కొద్ది రోజులకు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో భర్తకు సమాచారం అందించింది. ఏజెంట్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గోపి మంగళవారం పట్టణంలోని కైండ్‌నెస్ సొసైటీ అధ్యక్షుడు మాణిక్యాలరావు సహాయాన్ని అభ్యర్థించారు. తన భార్యను ఇండియాకు రప్పించాలని కోరుతూ ఏజెంట్‌కు కొంత సొమ్ము చెల్లించినా నిరాకరిస్తున్నాడని అతను వివరించాడు.
అక్కడ తనను ఓ గదిలో నిర్బంధించి ఏజెంట్ మనుషులు చిత్ర హింసలు పెడుతున్నారని ఆమె ఫోన్‌లో తెలిపిందని గోపి కన్నీటి పర్యంతమయ్యూడు. ఏజెంట్ తమను మోసం చేశాడని తెలిపాడు. మాణిక్యాలరావు మాట్లాడుతూ సత్యవతి పాస్‌పోర్టు , వీసా వివరాలు గోపీ వద్ద ఏమీ లేవన్నారు. విదేశాలకు వెళ్లేవారు తప్పనిసరిగా వాటి ఫొటోస్టాట్ కాపీలను కుటుంబ సభ్యులకు అందించాలని సూచించారు. ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావుతోను, విదేశీ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి సత్యవతిని ఇండియాకు రప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట న్యాయవాది ఆర్‌ఎస్‌వీ సోమేశ్వరరావు, లచ్చిరెడ్డి సత్యనారాయణ ఉన్నారు.
Advertisement
Advertisement