‘ఆప్కాబ్’ భవితవ్యంపై బదులివ్వలేను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) భవితవ్యంపై వ్యక్తమవుతున్న అనుమానాలకు తన వద్ద సమాధానం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్ముందు ఆప్కాబ్ తీరుతెన్నులెలా ఉండబోతాయో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఆప్కాబ్ ఆవిర్భవించి 50 ఏళ్లయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లీహాల్‌లో జరిగిన స్వర్ణోత్సవ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భవిష్యతు ్తలో కూడా ఆప్కాబ్ ఇలాంటి వేడుకలను జరుపుకుంటుందా, లేక ఇదే ఆఖరుది అవుతుందా అని కార్యక్రమంలో పాల్గొన్న నాబార్డ్ చైర్మన్ ప్రకాశ్‌బక్షి కిరణ్‌ను ప్రశ్నించారు.
ఆయన చాలా పెద్ద ప్రశ్నే అడిగారన్న కిరణ్, ప్రస్తుతం తనకు జవాబు తెలిదని బదులిచ్చారు. ఆప్కాబ్‌కు ఉజ్వల భవిష్యత్తుండాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తన తండ్రి అమరనాథరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షునిగా మొదలైందని గుర్తు చేసుకున్నారు. ఉపాధి హామీ వల్ల రాష్ట్రంలో గ్రామీణ పేదలకు 100 రోజుల ఉపాధి లభిస్తోందన్న కిరణ్, అదే సమయంలో రైతులకు కూలీల ఖర్చు పెరిగిపోయి సాగు గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. సాగులో సగటున ఎకరాకయ్యే కూలీల ఖర్చులో 30 శాతాన్ని రైతుకు అందించేలా ఉపాధి పథకాన్ని అనుసంధానించాల్సిన అవసరముందన్నారు. ముల్కనూరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
రుణ అర్హత కార్డుల కాలపరిమితి పెంచాలి: బక్షి
కౌలు రైతులకు బ్యాంకు రుణాలందించేందుకు జారీ చేస్తున్న రుణ అర్హత కార్డుల కాలపరిమితి ఏడాదే ఉండటంతో వారికి ఏటా రుణాలందడం కష్టమవుతోందని బక్షి అన్నారు. కౌలుదారీ చట్టాన్ని సవరించో, మరో మార్గం ద్వారానో దీర్ఘ కాలపరిమితి ఉండేలా కార్డులు మంజూరు చేయాలని కోరారు.