నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేస్తాం | niznizamsagar take over to trs party | Sakshi
Sakshi News home page

నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేస్తాం

Published Mon, Jan 13 2014 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేస్తాం

నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేస్తాం

బోధన్,న్యూస్‌లైన్ : రాబోయే తెలంగాణ రాష్ట్రంలో నిజాంషుగర్స్‌ను టేకోవర్ చేసుకుంటామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) అన్నారు. నిజాంషుగర్స్ కార్మికులకు మంచి రోజులు వచ్చే సమయం దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. నిజాంషుగర్స్ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్‌ఎస్ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి మహ్మద్ షకీల్ అధ్వర్యంలో ఆదివారం ఫ్యాక్టరీ ప్రధాన గేట్‌కు ఎదురుగా వజ్రోత్సవ సభను నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. వందల కోట్ల విలువచేసే నిజాంషుగర్ ఫ్యాక్టరీని 2002లో అప్పటి సీఎం చంద్రబాబు ఆంధ్ర ప్రాంతానికి చెందిన తన అస్మదీయులకు అప్పన్నంగా అప్పగించారని ఆరోపించారు.
 
 ప్రభుత్వరంగంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో నెలకు రూ. 18 వేల వేతనంపై పనిచేసిన కార్మికులు ,ఉద్యోగులను వీఆర్‌ఎస్ పేరుతో తొలగించారన్నారు. ప్రైవేట్ యాజమాన్యం వారినే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుని నెలకు రూ. 6 వేల వేతనంతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఆరోపించారు.కోర్టు తీర్పులను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసి అన్యాయం చేశాడన్నారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా మంత్రులతో సబ్ కమిటీ వేసి నిజాంషుగర్స్‌ను ప్రైవేటీకరించేందుకు చేసిన కుట్రలను నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి హైకోర్టులో స్టే తెచ్చి అడ్డుకున్నారని చెప్పారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీగా పేరు గడించిన నిజాంషుగర్స్ పరిస్థితి సీమాంధ్ర పాలకుల హయాంలో దయనీయంగా మారిందన్నారు. ఫ్యాక్టరీ వజ్రోత్సవాలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. బాధ్యతయుత పార్టీగా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తాము నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ కవచంగా నిలుస్తుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు పార్టీకి అండగా నిలువాలని కోరారు. సచార్ కమిటీ సిఫార్సులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.
 
 జిల్లా అభివృద్ధిని విస్మరించారు...
 టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పో శెట్టి మాట్లాడుతూ...  సీమాంధ్ర పాలకులు  జి ల్లా అభివృద్ధికి ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. నిజాం ప్రభువులు కాలంలోనే నిర్మించిన  నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికి పాలకులు విస్మరించారన్నారు.
 
 టీఆర్‌ఎస్ విలీనం అవాస్తవం...
 
 పార్టీ జిల్లా ఇన్‌చార్జి కరమిమెల్ల బాబూరావు మాట్లాడుతూ...  తెలంగాణ ఏర్పాటు ఖాయమని, రాబోయే ఎన్నికల్లో 119 అసెంబ్లీ, 19 పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. తమ పార్టీతో ఇతర పార్టీలో విలీనం అవుతుందని ప్రచారం అవాస్తవం అన్నారు.
 
 ఫ్యాక్టరీని అమ్మే కుట్ర...
 టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణలోని ఏ ఫ్యాక్టరీ అమ్మితే ఎన్ని కోట్లు మిగులుతాయేనని డబ్బు కక్కుర్తితో ఫ్యాక్టరీలను అమ్ముకునేందుకు యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్‌ఎస్‌ఎఫ్ వజ్రోత్సవ సభ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏ రజాక్, జిల్లా నాయకులు బిగాల గణేష్‌గుప్త, బస్వ లక్ష్మీనర్సయ్య, జీవన్‌రెడ్డి, రాజేందర్, దాదన్నగారి విఠల్, వేముల సురేందర్, నిజాంషుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం.అప్పిరెడ్డి, నియోజకవర్గ నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, రవికిరణ్, శ్యాంరావు, బాల్‌రాజ్, కాశ్యం సాయిలు, నవీన్ కుమార్, భరత్‌యాదవ్, ఫయాజుద్దీన్, కార్యకర్తలు, కాలనీ వాసులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement