ఈ-పాస్ ‘హుష్’
- మంత్రి ఇలాకాలోనే అమలుకాని వైనం
అనంతపురం అర్బన్: పేదల బియ్యం నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ-పాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిం ది. అయితే ఆ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఈ-పాస్ విధానం అమలు అరకొరగా సాగుతోంది. కొం దరు డీలర్లు ఈ పాస్ యంత్రాలను వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. నియోజవకర్గం పరిధిలో ఈ పాస్ అంతంత మాత్రంగా అమలవుతోంది. అనంతపురం రూరల్ మండలం చెందిన పాపంపేట, విద్యారణ్యనగర్, నందమూరినగర్, తారకరామనగర్, గణేశ్‌నగర్, సుందయ్య కాలనీలతో పాటు నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల ఈ పాస్ అమలు కావడం లేదు.
ఈ పాస్ యంత్రాలు వచ్చినప్పుడు స్థానిక నాయకులు ప్రారంభించారు. ఒక నెల ఈ-పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేసిన డీలర్లు అటు తరువాత వాటిని వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని డీలర్ల వద్ద ప్రస్తావిస్తే... అసలు తమకు ఈ పాస్ యంత్రాలు ఇవ్వలేదని, రాబోయే నెలలో ఇస్తామని అధికారులు అన్నారని వారు చెప్పుకొస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని మేమెందుకు ఈ పాస్ ద్వారా ఇవ్వాలంటూ అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొందరు డీలర్లు ఈ పాస్ యంత్రాలను ఆ శాఖకు వెనక్కి ఇచ్చేసినట్లు తెలిసింది.
రెండవ విడతలో మునిసిపాలిటీలకు
మొదటి విడతలో మంజూరైన 554 ఈ పాస్ యంత్రాలు మంత్రి ఇలాకాలో ఇచ్చినవి కొన్ని వెనక్కి వచ్చాయి. ఇక రెండవ విడతలో జిల్లాకు 690 ఈ పాస్ యంత్రాలు వచ్చాయి. వీటిని మునిసిపాలిటీల పరిధిలోనూ, కొన్ని ఉరవకొండ, కూడేరు మండలాల పరిధిలోని చౌక దుకాణాలకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లలేదనేది కొసమెరుపు.
ఈ- పాస్ యంత్రాలు వెనక్కు ఇస్తే చర్యలు
జిల్లాలో తొలి విడత మంజూరైన 594 ఈ- పాస్ యంత్రాలను జిల్లాలోని 63 మండలాలకు కేటాయించాం. వీటిని వెనక్కు ఇవ్వడానికి వీలులేదు. ఎవరైనా వెనక్కు ఇస్తే వారిపై పచర్యలు తప్పవు. రెండవ విడత మంజూరైన 690 యంత్రాలను అన్ని మునిసిపాలిటీల పరిధిలోని దుకాణాల్లో ఏర్పాటు చేశాము. ఉరవకొండ, కూడేరు మండలాల్లో కేవలం ఒకటి రెండు చోట్ల ఉండడంతో ఆ ప్రాంతాలకు కొన్ని కేటాయించాము.
- బి.లక్ష్మికాంతం, జాయింట్ కలెక్టర్