సాక్షి, నిజామాబాద్: విద్యుత్ శాఖలో అక్రమాల డొంక కదులుతోంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అధికారులు., కాంట్రాక్టర్లు కలిసి ఈ పనుల్లో నాణ్యతను గాలికొదిలేశారు. నిజామాబాద్ నగరంతో పాటు, కామారెడ్డి, బోధన్ పట్టణాల్లో పలుచోట్ల ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్ పనులను ఇష్టారాజ్యంగా చేసినట్లు విచారణాధికారులు నిర్ధారణకు వచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, పలుచోట్ల వీటిని ఏర్పాటు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు తేలింది. కొత్త విద్యుత్ లైన్లు చాలా కాలం మన్నాలంటే నైపుణ్యం (స్కిల్డ్ లేబర్) కలిగిన కార్మికులతో పనులు చేయించాలనేది నిబంధన. అయితే కాంట్రాక్టర్లు ఈ నిబంధనను గాలికొదిలేసి అన్ స్కిల్డ్ లేబర్‌తో పని కానిచ్చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు కూడా కాంట్రాక్టర్లకే వత్తాసు పలికినట్లు తెలిసింది. ట్రాన్స్‌ఫార్మర్లకు బిగించిన ఏబీ స్విచ్‌లు కూడా నాణ్యత లేనివి వినియోగించడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరా యం ఏర్పడుతున్నట్లు తెలిసింది. పనుల్లో నాణ్యత లోపించడంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని ఏఈలు సైతం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
నివేదిక సమర్పించిన విచారణాధికారులు
పట్టణ ప్రాంత వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలనే లక్ష్యంతో జిల్లాలో తొమ్మిది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కొత్తగా విద్యుత్ లైన్ల నిర్మాణం, లైన్ల పొడువును పెంచడం, లోఓల్టేజీ సమస్యను అరికట్టేందుకు కొత్త ట్రాన్స్‌ఫార్మార్ల ఏర్పాటు, సబ్‌స్టేషన్ల నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదులు రావడంతో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్ర విచారణకు అదేశించిన విష యం విధితమే. విచారణాధికారిగా డిస్కం సీజీఎం సంధ్యారాణిని నియమించారు. ఆమె వారం రోజుల క్రితం జిల్లాకు వచ్చి విచారణ జరిపారు. పనులు జరిగిన చోట్లకు వెళ్లి పరిశీలించారు. పనుల్లో జరిగిన అక్రమాలన్నీ ఆమె దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంధ్యారాణి ఇటీవల విచారణ నివేదికను కార్తికేయమిశ్రకు సమర్పించినట్లు సమాచారం.
అధికారులపై వేటు.?
విచారణాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలుండే అవకాశాలున్నాయని విద్యుత్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఒకరిద్దరు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులపై కూడా వేటు పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించామని ట్రాన్స్‌కో అధికారులు బయటకు చెబుతున్నారు. గ్యారంటీ పీరియడ్‌లో లోపాలు తలెత్తిన పక్షంలో సంబంధిత కాంట్రాక్టర్లతో సరిచేయిస్తామని అంటున్నారు.
టాన్స్‌కో పనుల్లో అక్రమాలపై నివేదిక ఇచ్చిన సీజీఎం
Published Mon, Aug 5 2013 4:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement