
‘అన్న’ క్యాంటీన్లు దండగ: జేసీ
సాక్షి, అనంతపురం: బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేని ప్రస్తుత పరిస్థితుల్లో హడావుడిగా ‘అన్న’ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఏమిటో అర్థం కావడం లేదని తాడిపత్రి ఎమ్మెల్యే (టీడీపీ) జేసీ ప్రభాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొన్ని పథకాలు అర్థం కావడం లేదని, అందులో ‘అన్న’ క్యాంటీన్లు ఒకటన్నారు.
తమిళనాడులో నిర్వహిస్తున్న క్యాంటీన్లను ఆదర్శంగా తీసుకుంటున్నారని, అక్కడ అన్నం, సాంబారుతో ప్రజలు భోజనం చేస్తారని, ఆ పద్దతి ఇక్కడ ఎంత మాత్రం సరిపోదన్నారు. ఇస్కాన్ అందిస్తున్న భోజనాన్ని సైతం ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు. అసలు ఇస్కాన్ అందిస్తున్న భోజనం లో చాలా లోపాలు ఉన్నాయన్నారు. తాము 2007 నుంచి తాడిపత్రిలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నామని, ఒకసారి తాడిపత్రికి వచ్చి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని చూస్తే ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు.