సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర పర్మిట్లపై ఏపీ, తెలంగాణల మధ్య చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పర్మిట్ల గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో లారీ యజమానులు, స్టేజి కారియర్లుగా తిరిగే బస్సుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి, సింగిల్ పర్మిట్ విధానం కొనసాగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపధ్యంలో మంగళవారం అసెం బ్లీలో ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు.
అయితే ఇరు రాష్ట్రాల అధికారులు, లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో కలిసి బుధవారం తెలంగాణ సచివాలయంలోని రవాణా మంత్రి చాంబర్‌లో భేటీ అవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు రవాణా అధికారులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వ వాదనలతో కూడిన నోట్స్, సంబంధిత పత్రాలన్నింటినీ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ వాహనాలు కూడా కాకినాడ పోర్టుకు, నల్లగొండ జిల్లా నుంచి సిమెంటు లోడు లారీలు ఏపీకి వస్తాయని రవాణా అధికారులు మంత్రికి వివరించినట్లు సమాచారం.