జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో నిర్వహణలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు పాట్లు తప్పలేదు. మొత్తంమీద 80 శాతం పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.
పల్స్ పోలియో పాట్లు
Published Mon, Feb 24 2014 12:35 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ :జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో నిర్వహణలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు పాట్లు తప్పలేదు. మొత్తంమీద 80 శాతం పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. మిగిలిన 20 శాతం మందికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి వేస్తామని అధికారులు చెప్పారు. చివరి నిమిషం వరకూ అంగన్‌వాడీలు పల్స్ పోలియో విధులు బహిష్కరిస్తున్నట్టు తెలియకపోవడంతో ఒడిదుడుకులు ఎదురైనట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహణకు విద్యార్థినులను వినియోగించారు. అయితే వారికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలోని 5,17,216 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 3,250 కేంద్రాలను, మరో 112 మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
దీని కోసం 7,158 మంది ఆరోగ్య సిబ్బంది, 4,050 మంది అంగన్‌వాడీలు, 4,289 మంది ఆశ కార్యకర్తలు, ఆరు వేల మంది ఇతర వలంటీర్లను నియమించారు. అయితే సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలు పల్స్ పోలియో విధులను బహిష్కరించడంతో వారి స్థానంలో విద్యార్థినులు, డ్వామా, ఇందిరా క్రాంతి పథం సిబ్బందిని రంగంలోకి దింపారు. పల్స్‌పోలియో నిర్వహణలో అంగన్‌వాడీలు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో ఆశ కార్యకర్తల సహకారంతో విద్యార్థినులు, డ్వామా, ఐకేపీ సిబ్బందిని ఇంటింటికీ పంపి మిగిలి ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
అవగాహన పెంచుకోవాలి
పోలియో వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు సూచించారు. కాకినాడ డెయిరీ ఫారమ్ సెంటర్‌లోని రాజీవ్ గృహకల్పలో ఆదివారం ఉదయం ఆయన లాంఛనంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యంలో పోలియో చుక్కలు వేయించడం ద్వారా వ్యాధిని తరిమికొట్టడమే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు లేనందున ప్రతి తల్లీ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి. పద్మావతి, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం. పవన్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ రవికుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement