గోదావరిఖని, న్యూస్‌లైన్: సర్కారు నిర్లక్ష్యం వల్ల రాజీవ్ స్వగృహ పథకం పడకేయడంతో మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోతోంది. రామగుండం మండలం కుందనపల్లి శివారు ఇంధన నిల్వల కేంద్రం ఎదురుగా రాజీవ్ రహదారిని ఆనుకుని 28.08 ఎకరాల విస్తీర్ణంలో స్వగృహ సముదాయ నిర్మానాన్ని 2008లో ప్రారంభించారు. ఈ సముదాయానికి అక్షయ కేంద్రం అని నామకరణం చేసి నిర్మాణాలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఆర్‌ఎస్‌సీఎల్) ఆధ్వర్యంలో నిర్ణీత సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది.
రామగుండం కార్పొరేషన్ పరిధిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో సొంతిల్లు నిర్మించుకోవడం మధ్య తరగతి ప్రజలకు కష్టసాధ్యంగా మారింది. దీంతో పలువురు ఉద్యోగులు, కార్మికులు, ఇతర వర్గాల వారు స్వగృహ సముదాయంలో నిర్ణీత రుసుము చెల్లించి ఇళ్లు బుక్ చేసుకున్నారు. వివిధ కారణాల వల్ల కొంతమంది వెనక్కు తగ్గగా, మరికొంత మంది విడతల వారీగా పూర్తి సొమ్ము చెల్లించి ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఐదేళ్లు గడస్తున్నా ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకపోవడం, ప్లాట్లు ఎప్పటిలోగా అప్పగిస్తారో కూడా వెల్లడించకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. నగరాలు, పట్టణాల్లో భూమి కొని ఇల్లు నిర్మించుకోలేని వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు వైఎస్సార్ ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పథకాన్ని 2008లో ప్రవేశపెట్టింది. జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు మున్సిపాలిటీల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ మరణానంతరం పాలకుల నిర్లక్ష్యం వల్ల రామగుండం మినహా మిగిలిన అన్ని చోట్ల ఈ పథకం అటకెక్కింది.
ఎన్నటికి పూర్తయ్యేనో..?
మొత్తం 176 ఇళ్ల నిర్మాణానికి 2008 నవంబర్ 27న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ భవనాలు నిర్మించే స్థలం ఎగుడుదిగుడుగా ఉండడం, పైన ఎన్టీపీసీకి చెందిన హైటెన్షన్ విద్యుత్ లైన్లు వెళుతుండడంతో చాలామంది ఆసక్తిచూపలేదు. చివరకు 177 మంది ముందుకు రాగా భవన నిర్మాణాలు ప్రారంభించారు. ఆయా శ్రేణులకు నిర్ణయించిన మొత్తాన్ని దశలవారీగా చెల్లించేం దుకు అవకాశమిచ్చారు. అక్షయ కేంద్రం రామగుండం, గోదావరిఖనిలకు దూరంగా ఉండడంతో.. చివరకు 30 మంది మాత్రమే మిగిలారు. వీరిలో 25 మంది లబ్ధిదారులు మొత్తం డబ్బులను చెల్లించగా, ఏడాదిలో భవనాలు అప్పగిస్తామన్నారు.
పస్తుతం క్లాసిక్ శ్రేణి భవనాలు నాలుగు, ఇంట్రినిక్స్ శ్రేణి భవనాలు 18తోపాటు బేసిక్, సివిక్ భవనాలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతున్నా లబ్ధిదారులకు భవనాలు అందుబాటులోకి రాలేదు. కొన్ని భవనాలకు రంగులు వేసినప్పటికీ వాటిలో అవసరమైన సామగ్రిని పొందుపర్చలేదు. కొన్ని కిటికీలకు ఇంకా అద్దాలను బిగించలేదు. పలు భవనాల లోపలి భాగంలో నిర్ణయించిన మేరకు టైల్స్‌ను ఏర్పాటు చేయలేదు. అమర్చిన టైల్స్ పలుచోట్ల పగిలిపోయాయి. దూరం నుంచి చూస్తే భవనాలు అందంగా కనిపిస్తున్నప్పటికీ దగ్గరకు వెళ్లి చూస్తే వాటి దుస్థితి కళ్లకు కడుతుంది. సివిక్ శ్రేణి భవనాలను తీసుకోవడానికి ఎక్కువ మంది రాకపోవడంతో వాటికి కేటాయించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల సర్వే చేసినట్టు సమాచారం.
మౌలిక వసతులేవీ?
అక్షయ కేంద్రంలో మౌలిక వసతుల కల్పన దారుణంగా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం గా ఉంది. ఇటీవల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మా ణం పూర్తి చేశారు. కానీ భూగర్భంలో పైపులను ఎగుడు దిగుడుగా వేయడంతో వర్షాకాలంలో నీరు బయటకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. తిరిగి డ్రైనేజీ పైపులైన్లను పూర్తిగా పెకిలించి మళ్లీ పైపులైన్లు వేస్తున్నారు. డ్రైనేజీ కుండీలు నిర్మించినా అవి ఎక్కడికక్కడ పగిలిపోయాయి. విద్యుత్ లైన్లు వేసినప్పటికీ రెండుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్కటీ అమర్చలేదు. గోదావరినది నుంచి తాగునీటిని సరఫరా చేస్తామని చెప్పి ఆ విషయాన్ని మర్చిపోయారు. మూడుచోట్ల బోర్లను మాత్రమే తవ్వించారు. కాలనీకి ఉపయోగపడేలా ట్యాంకు నిర్మాణం చేపట్టలేదు. రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల చెట్లపొదలతో అవి నిండిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీస సౌకర్యాలు లేకుండా తాము ఈ భవనాలలో ఎలా నివసించేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఆర్థిక సమస్యలతో ఆలస్యం
-ఎ.కొమురయ్య,
డీజీఎం, ఏపీఆర్‌ఎస్‌సీఎల్
రాజీవ్ స్వగృహ సంస్థకు కొంత ఆర్థిక సమస్య ఉండడం వల్ల భవన నిర్మాణాలు పూర్తి చేయడంలో ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ సమస్య తీరింది. ఇక చకచకా పనులు చేయిస్తున్నాం. వచ్చే జనవరి నాటికి డబ్బులు చెల్లించిన 25 మంది లబ్ధిదారులకు భవనాలను అప్పగిస్తాం.
‘స్వగృహం కల
Published Mon, Nov 11 2013 3:04 AM | Last Updated on Sat, Jul 7 2018 3:15 PM
Advertisement
Advertisement