
రమణ దీక్షితులు(ఫైల్)
సాక్షి, చిత్తూరు: పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులే తనకు ఫిర్యాదు చేశారని టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిక్ డైమండ్‌పై ఫిర్యాదు చేసి.. రమణ దీక్షితులు తనను పక్కదారి పట్టించారని అన్నారు. పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులు ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నానని, అందుకే తన రిపోర్టులో ఆ విషయం ప్రస్తావించానని తెలిపారు. రమణ దీక్షితులు ఆరోపణలో వాస్తవం లేదని జస్టిస్ జగన్నాథరావు కమిటీ నివేదికలో తేలిపోయిందన్నారు.
బంగారు డాలర్ల విచారణ భాగంలోనే పింక్ డైమండ్ విషయం బయటపడిందన్నారు. గతంలో బొక్కసానికి సంబంధించిన రెండు తాళాలు డాలర్ శేషాద్రి వద్దే ఉండేవని, తన రిపోర్టులో ఆయన దగ్గర తాళాలు ఉండకూడదని పేర్కొన్నానట్లు తెలిపారు. దీంతో తాను ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆభరణాల భద్రత విషయంలో చాలా మార్పులు చేశారని తెలిపారు. శ్రీ వారి నగలను ఆలయంలో జమాలజీ ల్యాబ్ ఏర్పాటుచేసి లెక్కగట్టారన్నారు. తాను ఇంతవరకూ పింక్ డైమండ్‌ని చూడలేదన్నారు. అదేవిధంగా రమణ దీక్షితులు టీటీడీకి ఇచ్చిన విరాళాన్ని తన అకౌంట్‌లో వేసుకునే వారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పటి ఈవో రమణాచారి దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఈవో ఆయన్ని మందలించి వదిలేశారని రమణ కుమార్ చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన కోరారు.