ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అరెస్ట్
రాయదుర్గం, న్యూస్‌లైన్: నాటకీయ పరిణామాల మధ్య అనంతపురం జిల్లా రాయదుర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఉచిత వివాహాల కోసం ఉంచిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఏడు ఫారిన్ లిక్కర్ బాటిళ్లు కలిగి ఉన్నారంటూ నాన్‌బెయిలబుల్ కేసు అక్రమంగా బనాయించి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. అంతకుముందు గురువారం రాత్రి బళ్లారిలో ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు జరిపిన సోదాలో ఆయన ఉచిత వివాహాలు నిర్వహించేందుకు సిద్ధం చేసిన సామగ్రి లభించింది. అర్ధరాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న రాజేశ్వరి ఇంట్లో కూడా గోడ గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. ఒంటి గంటకు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ భాస్కర్‌రెడ్డి, ఐదు మండలాల ఎస్‌ఐలతో పాటు కళ్యాణదుర్గం ఎస్‌ఐ, సుమారు 50 మంది ప్రత్యేక పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను నిద్రలేపి సోదాలు చేశారు. ఈ సందర్భంగా గత ఏడాది ఎమ్మెల్యే కాపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వివాహాల్లో పంచగా మిగిలిపోయిన పెళ్లి దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 129 చీరలు, 127 జుబ్బాలు, టవళ్లు, జాకెట్ పీసులు ఉన్నాయి. ప్రతి ఏటా గౌరీ పండుగ సందర్భంగా మహిళలకు సంప్రదాయంగా ఇచ్చే పసుపు, కుంకుమ, మట్టిగాజులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెడ్‌రూంలో ఉన్నట్లు చెబుతున్న ఏడు లిక్కర్ బాటిళ్లను తీసుకున్నారు. ఆర్డీఓ మాలోల, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికల అధికారి భూలక్ష్మి, త్రిమూర్తులు పంచనామా నిర్వహించారు. ఆ తర్వాత పోలీ సులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడానికి యత్నిం చారు. ఈ సందర్భంగా తనను ఏ విషయమై అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఎమ్మెల్యేతో పాటు ఆయన న్యాయవాది వెంకటరెడ్డి పోలీసులను ప్రశ్నించగా వారు సరైన సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు హడావుడి చేసి విదేశీ లిక్కర్ బాటిళ్లు ఉన్నాయని, ఎక్సైజ్ యాక్ట్ కింద అది నేరమని చెబుతూ అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆరోగ్య పరీక్షలు చేయించి రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ఎమ్మెల్యేను హాజరుపరిచారు.
వాదనలు విన్న జడ్జి సాయంత్రం 6 గంటలకు బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా బళ్లారిలో సోదాలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు బెయిల్‌పై వచ్చిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు సమాయత్తమయ్యారు. అయితే స్థానిక పోలీసుల వైఖరితో అప్పటికే అనారోగ్యంగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి.. అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రెస్ట్ అవసరమని భావించి అడ్మిట్ చేసుకున్నారు. అయితే కర్ణాటక పోలీసులు మాత్రం కాపును అరెస్ట్ చేస్తామని చెప్పి అక్కడే వేచి ఉన్నారు.