బడుగులంటే బాబుకు చులకన
- రెయిన్‌గన్ల పేరుతో రైతులను దగా చేశారు
- మహిళల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది
- ‘మంత్రి’ పదవితో వాల్మీకుల నోరు నొక్కేశారు
- రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి
రాయదుర్గం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడుగు, బలహీనవర్గాల ప్రజలంటే చులకన అని వైఎస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలు విస్మరించి ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ఇకపై చంద్రబాబు చేసే గిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ శుక్రవారం పట్టణ సమీపంలోని మద్దానేశ్వరస్వామి నూతన కళ్యాణమంటపంలో కాపు రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాల గుండ్ల శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, ప్లీనరీ పరిశీలకుడు రాగే పరుశురాం హాజరయ్యారు.
తొలుత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి నేతలంతా పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. అనంతరం కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ పాలనలో పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తే, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం టీడీపీ వారిమే పరిమితమైందన్నారు. అర్హత లేకున్నా అధికార పార్టీ వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అరకొర రుణమాఫీ చేసి రైతులను దగాకు గురిచేసిందన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోయి, వాటిని కట్టలేని స్థితిలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళల ఉసురు ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందన్నారు. 2014లో వెయ్యి అబద్దాలతో గద్దెనెక్కిన బాబు వచ్చే ఎన్నికల్లో రేషన్‌కార్డులు ఉన్న వారికి కార్లు, ఏసీలు, అరకిలో బంగారం ఇస్తామని కూడా చెప్పేందుకు వెనుకాడబోరని ఎద్దేవా చేశారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలో ఎక్కడ చేర్చాల్సి వస్తుందోననే భయంతోనే కాలవ శ్రీనివాసులుకు మంత్రి పదవి విదిల్చి ఆ సామాజికవర్గం నోరు నొక్కేశారని విమర్శించారు. వాల్మీకులను దగా చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రానికి పట్టిన టీడీపీ శనిని త్వరగా వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మీసాల రంగన్న, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ఐదు మండలాల పార్టీ కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.