
ఆక్రమణలు తొలగే వరకు పోరాటం
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి
నంద్యాల: ఆక్రమణలు తొలగేవరకు పోరాటం ఆగదని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో గాంధీచౌక్‌లో ప్రజలనుద్దేశించి భూమా ప్రసంగించారు. ప్రజల మేలు కోసం ఎంతవరకైనా పోరాడతానన్నారు. ప్రజా బలంతో తాను, ప్రభుత్వం అండ తో టీడీపీ నాయకులు యుద్ధాయినికి సిద్ధమయ్యారని అంతిమ విజయం తనదేనన్నారు. మున్సిపాలిటీలో ఎమ్మెల్యే జోక్యం ఎమిటని కొందరు ప్రశ్నిస్తున్నారని వారికి త్వరలోనే ఎమ్మెల్యే పవరేమిటో చూపిస్తామన్నారు.
రోడ్ల విస్తరణ సమస్యను పక్కదారి పట్టించేందుకు కొందరు ఎన్నికల సమయంలో తానిచ్చిన 10వేల ఇళ్ల నిర్మాణాల హామీని తెరమీదికి తెస్తున్నారని అయితే తమ పార్టీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నిర్మిస్తానని చెప్పిన సంగతి వారు మరిచిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. అయినా పేదలకు ఇళ్ల నిర్మాణాల కోసం సీఎం, పీఎంలను కలుస్తానన్నారు. శిల్పా డెరైక్షన్‌లో పురపాలక సంఘం యాక్షన్ చేస్తోందని దుయ్యబట్టారు.
టీడీపీ నేతలు తాము చేసిన మున్సిపల్ తీర్మానాలను వ్యతిరేకిస్తూ అవహేలన చేయడం బాధాకరమన్నారు. శిల్పా, సులోచన, ఆక్రమణ దారులకు తాను వ్యతిరేకిని కాదని వారు అభివృద్ధి విషయంలో వ్యవహరిస్తున్న వివక్షతకు వ్యతిరేకినన్నారు. జేఏసీ సభ్యులతో కలిసి భిక్షాటన చేసి నష్టపరిహారం చెల్లించైనా రహదారుల వెడల్పునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జేఏసీ చేస్తున్న పోరాటాన్ని తనతోపాటు స్థానిక ప్రజలు విస్మరించరన్నారు.