
రెవెన్యూలో అక్రమాల పుట్ట
ఉదయగిరి నియోజకవర్గంలోని రెవెన్యూలో అక్రమాల పుట్ట పగలింది. తీగలాగితే డొంక కదులుతోంది. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి కొండాపురం..
♦ తీగలాగితే కదులుతున్న డొంక
♦ ప్రస్తుత కలిగిరి తహశీల్దార్ సస్పెన్షన్
♦ మరో తహశీల్దార్‌పై జరుగుతున్న విచారణ
కొండాపురం : ఉదయగిరి నియోజకవర్గంలోని రెవెన్యూలో అక్రమాల పుట్ట పగలింది. తీగలాగితే డొంక కదులుతోంది. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి కొండాపురం.. ఇప్పటి కలిగిరి తహశీల్దార్ లావణ్యపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. కొండాపురంలో తహశీల్దార్‌గా పని చేసిన మరో తహశీల్దార్‌పై కూడా శాఖపరమైన విచారణ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సంబంధించిన భూములకు, అటవీ భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు పలు ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాల సృష్టించిన విషయంలో తహశీల్దార్ లావణ్య పాత్ర ఉన్నట్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిపై విచారణ చేసిన రెవెన్యూ ఉన్నతాధికారులకు ప్రాథమిక ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది. గతంలో కొండాపురం మండలంలో పనిచేసిన మరో తహశీల్దార్‌పై కూడా శాఖా పరమైన విచారణ ప్రారంభమైనట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి తయా రు చేసిన పట్టాలను బ్యాంకుల్లో పెట్టి సుమారు కోటి రూపాయల వరకు రుణాన్ని తెచ్చుకుంటున్న రెవెన్యూ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
వచ్చిన ఆరోపణలు ఇవి..
గానుగపెంట పంచాయతీలోని సర్వే నంబర్ 287లో ఉన్న అనాధీనం 60 ఎకరాల పొరంబోకు భూమి, సర్వే నంబర్లు 244, 45లోని వాగు పొరంబోకు, శ్మశాన భూమి 7 ఎకరాలు, సర్వే నంబర్ 382లోని 12 ఎకరాల అటవీ భూమికి నకిలీ పాస్‌పుస్తకాలు సృష్టించారు.
గానుగపెంట ఎస్సీ కాలనీని సాగు భూమిగా చూపుతూ పట్టాలు మంజూరు చేశారు.
పొట్టిపల్లిలోని 100,101 సర్వే నంబర్లలో ఉన్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన 60 ఎకరాల భూములను 25 మంది పేరున పట్టాలు మంజూరు చేశారు.
సదరు వ్యక్తులు నకిలీ పట్టాలతో వివిధ బ్యాంకులు, సొసైటీల్లో పెట్టి రూ.కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి గంటా భూముల వ్యవహారంపై గతేడాది డిసెంబర్‌లో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.
కలిగిరిలోనూ..
కలిగిరి మండలంలో నకిలీ పట్టాలపై ఆమెను విచారణ అధికారిగా జిల్లా ఉన్నతాధికారులు నియమించారు. తహశీల్దార్‌గా పనిచేస్తున్న కలిగిరి మండలంలోనూ ఆమె పేరున ఉన్న నకిలీ పట్టాలు వెలుగులోకి వచ్చినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అవి బయటకు రాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఆధార్ కార్డుల అనుసంధానంతోనే
ఆధార్ కార్డులను బ్యాంకుల్లో పాస్‌బుక్‌లకు అనుసంధానంతోనే ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ అక్రమాలపై జేసీ కలిగిరి, కొండాపురం మండలాల్లో విచారణ చేపట్టగా వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది.
మరో తహశీల్దార్‌పై కొనసాగుతున్న విచారణ
కొండాపురంలో గతంలో పనిచేసిన మరో తహశీల్దార్‌పై శాఖా పరమైన విచారణ జరుగుతున్నట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెపై విచారణ జరుగుతుంది. దీంతో ఆ తహశీల్దార్‌కు పదోన్నతి కూడా ఆగినట్లు సమాచారం.