బియ్యం అక్రమ నిల్వలపై దాడులు
- 245 బస్తాల బియ్యం ప్రభుత్వ గోదాముకు తరలింపు
- బండకిందపల్లెలో ఘటన
సోమల: మండలంలోని బండకిందపల్లెలో బుధవారం తహశీల్దార్ నరసింహులు, ఎస్‌ఐ చిన్న రెడ్డెప్పలు అక్రమ బియ్యం వ్యాపారంపై దాడులు చేశారు. బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న 245 బస్తాల బియ్యాన్ని సదుం వద్ద ఉన్న ప్రభుత్వ గోదాముకు తరలించారు.
బండకిందపల్లె వద్ద ఉన్న ఓ రైతు ఇంటిలో అక్రమ బియ్యం నిల్వలు ఉన్నాయని ఎస్‌ఐ చిన్నరెడ్డెప్పకు రహస్య సమాచారం అందింది. దీంతో ఆయన సిబ్బంది తో కలసి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 245 బస్తాల బి య్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులను విచారించగా రాయచోటికి చెందిన ఓవ్యక్తి కొంతకాలంగా అక్రమబియ్యం వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో అతనికి చెందిన 50 కేజీల బరువున్న బస్తాల నుంచి బియ్యం వేరుచేసి, వాటికి ఆయిల్ కలిపి 21, 22 కేజీల బరువుతో ప్యాకింగ్ చేస్తున్నట్టు తెలిపారు.
బియ్యం నిల్వలకు సంబంధించిన రికార్డులను చూపమని ఎస్‌ఐ కోరగా వారు ఎలాంటి రిక్డాలు లేవని సమాధానం చెప్పారు. దీంతో తహశీల్దార్ నరసింహులుకు ఎస్‌ఐ సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి ఆర్‌ఐ మహేశ్వరితో కలసి ఆయన చేరుకున్నారు. పంచనామా నిర్వహించి 50 కేజీల బరువున్న 70 బస్తా లు, 22 కేజీల బరువున్న 49 బస్తాలు, 21 కేజీల బరువుగల 126 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం విలువ రూ.1.25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఈ అక్రమ బియ్యం వ్యాపారం మూడు నెలలుగా జరుగుతోందని, నిత్యం కల్లూరుకు టెంపోల ద్వారా తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. దీనిపై తహశీల్దార్‌ను వివరణ కోరగా 245 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ గోదాముకు తరలించామని తెలిపారు. విషయం ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీటీ ప్రభావతమ్మ, వీఆర్‌ఏ పురుషోత్తం పాల్గొన్నారు.