కోడి గుడ్డు తెచ్చిన తంటా....
ధర్మవరం: కోడి గుడ్డు తెచ్చిన వివాదం.. ఓ వ్యక్తిపై నాన్‌బెయిలబుల్ కేసుకు నమోదుకు కారణమైంది. దీంతో పోలీసుల ఏకపక్షంగా వ్యవహరించడంతో బాధితులు లబోదిబోమంటూ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లికి చెందిన రమణ అనే వ్యక్తికి చెందిన కోడి, వాళ్లింటికి ఎదురుగా ఉన్న టీడీపీ నాయకుడి ఇంట్లోకి వెళ్లి గుడ్డు పెడుతుండేది. ఆ గుడ్లను సదరు నాయకుడి కుటుంబ సభ్యులు కూర వండుకుని ఆరగిస్తుండేవారు.
కోడి గుడ్డు పెట్టకపోవటంతో అనుమానం వచ్చిన రమణ భార్య రమణమ్మ.. తమ కోడి పెడుతున్న గుడ్లను ఎవరో దొంగిలిస్తున్నారని దూషించసాగింది. దీంతో తమను ఉద్దేశించే ఆమె తిడుతుందని భావించిన టీడీపీ నాయకులు రమణమ్మపై దాడి చేసి గాయపరిచారు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఇంటి వద్దకే వచ్చి విచారణ చేస్తామంటూ పోలీసులు నాగారెడ్డిపల్లికి వెళ్లారు. పోలీసులు విచారణ జరుపుతుండగానే వారి సమక్షంలోనే టీడీపీ నాయకుడు మళ్లీ భార్యాభర్తలపై దాడి చేశాడు. దీంతో ఇరు వర్గాల పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బాధితుడు రమణపై నాన్‌బెయిలబుల్ కింద హత్యాయత్నం(సెక్షన్-307) కేసు నమోదు చేయగా, దాడి చేసిన వారిపై మాత్రం బెయిలబుల్ కేసును నమోదు చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.