బడిపంతులు చదువుకూ భారీగా ఫీజులు
విజయనగరం అర్బన్: భావి ఉపాధ్యాయులను తీర్చిదిద్దాల్సిన కొన్ని ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు అక్రమ వసూళ్లతో జేబులు నింపుకొంటున్నారు. ప్రాథమిక విద్యాబోధనకు బీఎడ్ విద్యార్హత అనుమతి నిరాకరిస్తూ కేవలం డీఎడ్ అభ్యర్థులకే అవకాశం ఇవ్వడం, ఎస్‌జీటీ పోస్టులు ఊరిస్తుండడంతో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. ఎంతైనా చెల్లించి సీట్లు పొందేందుకు అభ్యర్థులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీఎడ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. యాజమాన్య కోటా ఫీజులను ఇష్టానుసారంగా పెంచేసి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మూడేళ్లలో 27 కాలేజీలు..
ఈ మూడు సంవత్సరాల కాలంలోనే జిల్లాలో 27 ప్రైవేటు కళాశాలలు పుట్టుకొచ్చాయి. వీటిలో పూర్తి స్థాయిలో వసతులు లేనివే ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 28 డీఎడ్ కళాశాలలున్నాయి. వీటిలో ఒకటి ప్రభుత్వ కళాశాల (వేణుగోపాలపురం), మిగిలిన 27 ప్రైవేటు కళాశాలలే. ప్రభుత్వ డైట్ కళాశాలలో 100 సీట్లు ఉండగా మిగిలిన ప్రైవేటు కళాశాలల్లో ఒక్కొక్క కళాశాలలో 50 చొప్పున మొత్తం 1,350 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా కింద 1,080 సీట్లు, మేనేజ్‌మెంట్ కోటా కింద 270 సీట్లు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 1,450 సీట్లకు గానూ మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించి, భర్తీ చేస్తారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలోనే తొలి ఏడాదికి జనరల్ అభ్యర్థులు రూ.12,500, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ. 1,500 ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు మిగిలిన మొత్తం సంక్షేమ శాఖల ద్వారా యాజమాన్యాలకు చేరుతుంది. అయితే కొన్ని కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి గత ఏడాది కళాశాలల్లో చేరిన విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు బలవంతంగా వసూలు చేశారు.
రూ.లక్షలకు కోటా సీట్ల విక్రయం
జిల్లాలోని ప్రైవేటు డీఎడ్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో యాజమాన్యాలు దండుకోవడమే పనిగా పెట్టుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. అభ్యర్థుల ఆసక్తిని ఆసరాగా చేసుకున్న యాజమాన్యాలు ఒక్కసారిగా సీటు రేటును పెంచేశాయి. గత ఏడాది తొలి విడత కౌన్సెలింగ్ సమయంలో మేనేజ్‌మెంట్ కోటా సీటుకు రూ.1.50 లక్షల వరకూ వసూలు చేయగా, కౌన్సెలింగ్ పూర్తయి, తరగతులు ప్రారంభమయిన తరువాత మిగిలిన మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు డిమాండ్ పెరిగింది. మొదట వచ్చిన వారికి మంచి ధర అంటూ రూ.2. లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేశారు. రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వారి సిఫారసు ఉన్న వారి నుంచి రూ.2. లక్షలు వసూలు చేస్తుండగా, ఎలాంటి సిఫారసులేని విద్యార్థుల నుంచి రూ.2.5 లక్షలు దండుకున్నారు.
డిమాండ్ ఉన్న చోట రూ.30 లక్షలు కూడా వసూలు చేసినట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని రెండు విడతల్లోనే చెల్లించాలని డిమాండ్ చేయడంతో పేద విద్యార్థులు అప్పుల పాలయ్యారు. డీఎడ్ సీటుకు ఇన్ని లక్షలు ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘లక్షలు పోసి కళాశాలకు అనుమతి తెచ్చుకోవడమే కాకుండా, ఎంఈడీ చేసిన అధ్యాపకులకు వేలకు వేలు జీతాలు ఇవ్వాలి. ఇప్పటికే భవన నిర్మాణానికే లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడు ఈ విద్యార్థుల నుంచి తీసుకోకపోతే... మేమెలా బతికేది’ అంటూ కళాశాలల యాజమాన్యాలు ఎదురు ప్రశ్నిస్తున్నాయి. డీఎడ్ కళాశాలల్లో విచ్చలవిడిగా సీట్ల విక్రయాలు జరుగుతున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టించుకుంటున్న దాఖలాలు కనబడడం లేదు.
కళాశాల ఏర్పాటుకు నిబంధనలివే..!
డీఎడ్ నిర్వహించే కాలేజీకి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం ఉండాలి. ఇందులో ఒక సైకాలజీ ల్యాబ్, రెండు సైన్స్ ల్యాబ్‌లు, రెండు వేల చదరపు అడుగుల మల్టిపర్పస్ హాలు, ఫస్టియర్‌కు రెండు తరగతి గదులు, సెకండియర్‌కు నాలుగు క్లాసు రూములు, ఒక ఎస్పీడబ్ల్యూ (సోషియల్ యూజ్‌ఫుల్ వర్క్) ల్యాబ్, ఒక ఆటల పరికరాల గది, బాలురు, బాలికలకు ప్రత్యేక వెయిటింగ్ రూములు, మరుగుదొడ్లు, రెండు ఎకరాలలో క్రీడా మైదానం, స్టాఫ్, ప్రిన్సిపాల్, పరిపాలనా అధికారి గదులు ప్రత్యేకంగా ఉండాలి. కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి. లక్షలు సమర్పించుకున్నా పలు కళాశాలల్లో మౌలిక వసతులు మచ్చుకైనా కనిపించడం లేదు.
నిబంధనలు పాటించకపోతే అనుమతులివ్వం..
యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలు నిబంధనల మేరకు జరపకపోతే సంబంధిత సీట్లకు అనుమతులివ్వబోమని ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ టికెవి సత్యనారాయణ తెలిపారు. కౌన్సెలింగ్ పూర్తయిన తరువాత కళాశాలల వారీగా యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాలు పరిశీలిస్తామన్నారు. డొనేషన్ల వసూలుపై విద్యార్థుల నుంచి ఫిర్యాదులుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.