
సీమ సమస్యలపై తాడోపేడో తేల్చుకుంటాం
కర్నూలు(అర్బన్):రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను నిర్మించి అంతుచూస్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామక్రిష్ణ, పి.మధు హెచ్చరించారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సీమలోని సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయించాలని సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గత నెల 20న చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రారంభమైన బస్సు యాత్ర శనివారం సాయంత్రం కర్నూలుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండ్ అంబేద్కర్ సర్కిల్‌లో భారీ ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల జిల్లా కార్యదర్శులు కె.ప్రభాకర్‌రెడ్డి, కె.రామాంజనేయులు అధ్యక్షతన ఏర్పాటైన బహిరంగ సభకు సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు సురవరం సుధాకర్‌రెడ్డి, సీతారాం ఏచూరి ముఖ్య వక్తలుగా హాజరయ్యారు.
చంద్రబాబుది నాలుకా.. తాటిమట్టా
కర్నూలు జిల్లా అభివృద్ధికి 27 వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుది నాలుకా.. లేక తాటిమట్టా ? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గ్రహించాలన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ..రెండేళ్లు అవుతున్నా అభివృద్దిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారడన్నారు. బ్రాహ్మణి స్టీల్స్ స్థానంలో కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎలాంటి రాజకీయ విలువలు లేవన్నారు.
రూ.27,350 కోట్లు అడిగితే రూ.50 కోట్లు ఇస్తారా?
రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ కోసం రూ.27,350 కోట్లు ఇవ్వాలంటే, కేవలం జిల్లాకు రూ.50 కోట్లు ఇస్తే అభివృద్ధి సాధ్యమవుతుందా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామక్రిష్ణ ప్రశ్నించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలో వందలాది మంది రైతులు, చేనేత కార్మికులు ఆకలి చావులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి కరువు, ప్రజల ఇబ్బందులను చూసి పాలకులు తల వంచుకోవాలన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం వల్ల పాలెగాళ్ల రాజ్యం వస్తుందే తప్ప, ఎలాంటి అభివృద్ధి జరగదరన్నారు. సభలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, రాయలసీమ సబ్ కమిటీ సభ్యులు జి.ఓబుల్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల, సీపీఐ నగర కార్యదర్శి ఎస్‌ఎన్ రసూల్, జిల్లా సమితి సభ్యులు ఎస్.మునెప్ప, సీపీఎం నగర కాార్యదర్శి గౌస్‌దేశాయ్ తదితరులు
పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు, రాయలసీమ కన్నీటి గాథలపై పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సభకు ముందు నంద్యాల చెక్‌పోస్టు నుంచి సభాస్థలి వరకు కామ్రేడ్లు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.