"టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేస్తూ కేంద్ర ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై సహజంగానే చంద్రబాబు నోరు మెదపరు. ఆయన తనయుడు లోకేష్ కూడా ప్రయోజకుడై ఈ అవినీతిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయనా మౌన దీక్షలోనే ఉంటారు.
ఆయనకు అనుకూలంగా వార్తలు వండి వార్చడానికే ఉన్నాయి కాబట్టి కొన్ని జేబు మీడియాలూ ఏమీ ఎరగనట్లు చప్పుడు చేయకుండా ఉండిపోతాయి. చంద్రబాబు నాయుడికి మిత్ర పక్షీయుడు కాబట్టి జనసేన అధినేత పవన్ కానీ...ఆయన పార్టీ నేతలు కానీ ఐటీ నోటీసుల గురించి పొరపాటున కూడా ప్రశ్నించరు. కామ్రేడ్లు కూడా నోళ్లకు తాళాలు వేసుకున్నట్లు మౌనంగా ఉండిపోవడం ఏంటి? అని వామపక్ష మేథావులు మండి పడుతున్నారు."
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాజధాని అమరావతిలో సచివాలయంతో పాటు కొన్ని భవనాల నిర్మాణ పనులకు సంబంధించి షాపూర్ జీ పల్లోంజీ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఆ క్రమంలో పల్లోంజీ కంపెనీ నుండి నకిలీ ఇన్ వాయిస్ ల పేరుతో డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడి పిఏ శ్రీనివాసు సూచించిన విధంగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దారి మళ్లించేసి చంద్రబాబు చెప్పిన ఖాతాకు పంపేశారు.
ఒకటీ రెండూ కాదు ఏకంగా 118 కోట్ల 90లక్షల రూపాయలకు పైనే ఇలా నిధులను భోంచేసినట్లు సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఐటీ శాఖ అధికారులు నోటీసులు పంపారు. ఈ డబ్బును ఏవిధంగా మీ సొంతం చేసుకున్నారో చెప్పండి మహాశయా అని ఆ నోటీసుల్లో ప్రశ్నించారు.
ఐటీ ప్రశ్నలకు చంద్రబాబు దగ్గర సమాధానాలు లేక కాదు. ఉన్నాయి. కాకపోతే అవి ఆయన పీకకి చుట్టుకునేవి కావడంతో ఆయన బెల్లం కొట్టిన రాయిలా ఏం మాట్లాడ్డం లేదు. చంద్రబాబు నాయుడితో పాటు ఆయన తనయుడు లోకేష్ పేరును కూడా ఐటీ నోటీసుల్లో ప్రస్తావించారు. లోకేష్ బినామీ కిలారు రాజేష్ పేరు కూడా చాలా స్పష్టంగా ఉంది.
కొడుకు పుట్టినపుడు కాదు..వాడు ఎదిగి ప్రయోజకుడు అయినప్పుడు తండ్రిగా గర్వపరడాలంటారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తనతో పాటు తన తనయుడు కూడా అక్రమార్గంలో దూసుకుపోతూ ప్రయోజకుడు అయినందుకు గర్వపడుతూ ఉండచ్చని పాలక పక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.
కొద్ది రోజులుగా ఈ ఐటీ నోటీసులపై జాతీయ మీడియాలో కథలు కథలు గా వార్తలు ప్రచురితమవుతూ వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ నోటీసుల గురించే అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు మాత్రం ఈ నోటీసులతో తమకి సంబంధం లేదనుకున్నారో లేక చంద్రబాబు అవినీతి గురించి మనమెందుకు మాట్లాడదాలనుకున్నారో తెలీదు కానీ ఇది తమ సబ్జెక్ట్ కాదని పక్కన పెట్టేసినట్లున్నారు.
తాను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎలాగూ చంద్రబాబు అవినీతిపై ప్రశ్నించే సాహసం చేయరని పాలక పక్ష నేతలు అంటున్నారు. బాబు అనుకూల మీడియా ఉన్నదే బాబును కాపాడ్డానికి కాబట్టి ఆ మీడియా కూడా ఐటీ నోటీసుల ఊసెత్తడం లేదు.
మిగతా వాళ్లు సైలెంట్ గా ఉండడాన్ని అర్ధం చేసుకోవచ్చు కానీ.. కామ్రేడ్లు కూడా సైలెంట్ అయిపోవడమే దిగజారుతోన్న రాజకీయాలకు పతనమవుతోన్న విలువలకూ నిలువెత్తు నిదర్శనం అంటున్నారు వామపక్ష మేథావులు. కమ్యూనిస్టులు మరీ ఇంతగా పతనం చెందుతారని ఊహించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-సీఎన్ఎస్ యాజులు
సీనియర్ జర్నలిస్ట్ 'సాక్షి'
Comments
Please login to add a commentAdd a comment