ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంత నేతలు మంగళవారం ఏపీ భవన్లో సమావేశం అయ్యారు.
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో సీమాంధ్ర ప్రాంత నేతలు మంగళవారం ఏపీ భవన్లో సమావేశం అయ్యారు. అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేసిన ముఖ్యమంత్రి ఈరోజు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఏకే ఆంటోనీతో భేటీ కానున్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించాలని ముఖ్యమంత్రి అధిష్టానాన్ని కోరనున్నట్లు సమాచారం.
అప్పటివరకూ విభజన ప్రక్రియ నిలిపివేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కిరణ్ కుమార్ రెడ్డి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాగా సీఎంతో సమావేశం అయిన నేతల్లో శైలజానాథ్, గాదె వెంకటరెడ్డి, రుద్రరాజు పద్మరాజు, పితాని సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
విభజన కారణంగా పలు సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో అవి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తాయని సీమాంధ్ర ప్రాంత నేతలు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సీమాంధ్రప్రాంత నేతలతో వరుసగా రెండుసార్లు నిర్వహించిన సమావేశంలో వారంతా ఈ సమస్యలను ఏకరవుపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు రెండుసార్లూ తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ రెండింటిపైనా సీఎం, పీసీసీ అధ్యక్షులిద్దరూ సంతకాలు చేశారు. ఈ లేఖలు ఆంటోనీ కమిటీకి కూడా పంపించారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేడు ఆంటోనీ కమిటీని కలవనున్న నేపథ్యంలో అంతకుముందుగానే సీఎం ఆ కమిటీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెలువరిస్తున్న అనుమానాలను ఆయన పార్టీ అధిష్టానానికి, ఆంటోనీ కమిటీకి వివరించనున్నారు. విభజన నిర్ణయం అమలులో తలెత్తే ఇతర క్లిష్ట సమస్యలను కూడా ఆయన పార్టీ పెద్దలకు తెలియచేయనున్నారని తెలుస్తోంది.