సీఎం కారును పక్కకుపెట్టి, ఆ ప్రాంతంలో సింగపూర్ మంత్రి కారు పెట్టిన దృశ్యం
ఏడు నక్షత్రాల హోటల్‌లో బస
సచివాలయంలో మంత్రి ఈశ్వరన్‌కు అపూర్వ స్వాగతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌కు, ఆయన బృందానికి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. ఈశ్వరన్‌తో పాటు సింగపూర్ లోని వివిధ సంస్థలకు చెందిన వంద మంది ప్రతినిధులకు నగరంలోని ఏడు నక్షత్రాల హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. అదే హోటల్‌లో సింగపూర్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. నూతన రాజధాని ప్రాంతంలో నీరు, సిమెంట్, స్టీల్ లభ్యత తదితర అంశాలను వారు అడిగి తెలుసుకున్నారు.
అక్కడ రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకత తదితర అంశాలపై ఆరా తీశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన అనుమతులకు ఎన్ని రోజులు సమయం పడుతుందని ప్రశ్నించగా.. కొన్ని అనుమతులకు 21 రోజుల సమయం పడుతుందని, మరికొన్నింటికి వారం రోజులు పడుతుందని అధికారులు వివరించారు. వారం రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే అనుమతిచ్చినట్లే భావించాలని కూడా వివరించారు.
ఆ తర్వాత సాయంత్రం.. ఈశ్వరన్ కన్నా పది నిమిషాల ముందు ఆరు మినీ బస్సుల్లో సింగపూర్‌కు చెందిన బృందం సచివాలయానికి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఈశ్వరన్‌కు సచివాలయంలో సీఎం చంద్రబాబుఅపూర్వ స్వాగతం పలికారు. సీఎం ఎల్ బ్లాకు కిందకు వచ్చి పుష్పగుచ్ఛం అందజేసి ఈశ్వరన్‌కు స్వాగతం పలికారు. దగ్గరుండి ఎనిమిదవ అంతస్తులోని తన కార్యాలయానికి ఈశ్వరన్‌ను తోడ్కొని వెళ్లారు.