తూచ్...
ఈ ప్రభుత్వంలో ఎప్పుడేం జరుగుతుందో... ఎప్పుడు ఎవర్ని మార్చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా ఉత్తర్వులిచ్చి...ఇలా రద్దు చేసేస్తున్నారు. ఉత్తర్వులకు విలువ లేకుండా తూచ్ అనేస్తున్నారు. వారం రోజుల క్రితం డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్‌గా శ్రీకాకుళం పీడీగా పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తిని నియమించారు. ఇంతలో ఏమైందో తెలియదు గాని ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఆ పోస్టులో ప్రస్తుతం గుంటూరులో డీఆర్‌డీఎ పీడీగా పనిచేస్తున్న ప్రశాంతిని నియమించారు. ఇలా రోజుల వ్యవధిలోనే నియామకాలు మార్చేయడం ప్రస్తుత సర్కార్‌కు కొత్తేమీ కాదు. ఆ మధ్య డీఆర్‌డీఏ అడిషనల్ పీడీగా పనిచేస్తున్న సుధాకర్‌ను ఇన్‌చార్జ్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతలోనే తెరవెనుక ఒత్తిళ్లు రావడంతో హుటాహుటీన ఆ పోస్టులో అడిషనల్ పీడీగా పనిచేస్తున్న పెద్దిరాజును నియమించారు. అంతకుముందు వివాదాస్పదంగా నిలిచిన పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్‌కు పీఎ టూ ఎస్‌ఈగా నియమించారు. ఆ ఉత్తర్వులిచ్చిన నాలుగురోజుల్లోనే రద్దు చేస్తూ మరో ఉత్తర్వులిచ్చారు. దీన్నిబట్టి సర్కార్ ఇస్తున్న ఉత్వర్వులకు విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే నవ్వులాటగా మారిపోయింది.
దంపతులిద్దరికీ కీలక పోస్టింగ్‌లు
డీఆర్‌డీఎ పీడీగా ఢిల్లీరావు నియమితులైన రోజునే ఆయన భార్య ప్రశాంతి కోసం ఏదొక పోస్టు ఖాళీ చేయాల్సిందేనని ‘సాక్షి’ ముందే చెప్పింది. ఇప్పుడదే జరిగింది. ప్రస్తుతం ఢిల్లీరావు దంపతులిద్దరూ గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారు. అక్కడ డ్వామా పీడీగా ఢిల్లీరావు, డీఆర్‌డీఎ పీడీగా ప్రశాంతి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అనూహ్యంగా ఢిల్లీరావు ఇక్కడ డీఆర్‌డీఏ పీడీగా నియమితులయ్యారు. అదే సందర్భంలో డ్వామా పీడీగా శ్రీకాకుళంలో అదే పోస్టులో పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తి నియమితులయ్యారు. దీంతో స్పౌజ్ కోటాలో జిల్లాకొస్తున్న ప్రశాంతికి ఆ స్థాయి పోస్టు జిల్లాలో కనిపించలేదు. తొలుత ఆర్డీఓగా రావాలని భావించా రు. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వెంకటరావు తన రాజకీయ సన్నిహితుల ద్వారా గట్టిగా ప్రయత్నించి బదిలీని ఆపుకొన్నారు. దీంతో అప్పటికే ఖాళీగా ఉన్న డీఆర్‌ఓ పోస్టుపై దృష్టి సారించారు. ఇంతలోనే విశాఖపట్నం ఏజేసీగా పనిచేసిన వై.నర్సింహారావు యుద్ధ ప్రాతిపదికన డీఆర్‌ఓ పోస్టింగ్ వేయించుకున్నారు.
ఇక హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు తప్ప మరేది ఖాళీగా లేని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో ఆమెను హౌసింగ్ పీడీగా నియమించారన్న ప్రచారం జరిగింది. అంతా అదే భావించారు. కానీ అనూహ్యంగా ప్రశాం తికి డ్వామా పీడీ పోస్టు వరించింది. పైరవీలు, ప్రయత్నాలు ఏ స్థాయిలో ఫలించాయో తెలియదు గాని కళ్యాణ చక్రవర్తికిచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి ఆ స్థానంలో ప్రశాంతిని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మొత్తానికి భార్యాభర్తలిద్దరికీ కీలక పోస్టులు దక్కినట్టయింది. గుంటూరులో ఢిల్లీరావు డ్వామా పీడీగా పనిచేస్తే ఇక్కడ డీఆర్‌డీఎ పీడీగా నియమితులు కాగా, ప్రశాంతి అక్కడ డీఆర్‌డీఎ పీడీగా పనిచేస్తే ఇక్కడ డ్వామా పీడీగా నియమితులయ్యారు. జిల్లా మారడంతో వారిద్దరి పోస్టులు తారుమారైనట్టు అయింది. గతంలో జిల్లాలో పనిచేసినప్పుడు ఢిల్లీరావు విజయనగరం ఆర్డీఓగా పనిచేయగా, ప్రశాంతి పార్వతీపురం ఆర్డీఓగా పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ప్రశాంతి కేఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, హౌసింగ్ స్పెషలాఫీసర్ పోస్టులో కూడా పనిచేశారు.
కొంపముంచిన ఆలస్యం
ఈ ప్రభుత్వంలో ఉత్తర్వులకున్న విలువ ఏంటో తెలియక ఇటీవల డ్వామా పీడీగా నియమితులైన కళ్యాణ చక్రవర్తికి అనూహ్య షాక్ తగిలింది. ఉత్తర్వులిచ్చిన వెంటనే జాయిన్ అవ్వకపోవడంతో కొంపమునిగినట్టయింది. ఎప్పుడెలా ఉంటుందో తెలియకే ఇలా చేసి ఉంటారన్న వాదనలు వినిపించాయి. బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులైనా చేరకపోవడంతో ఇదే అవకాశంగా తీసుకుని ప్రశాంతిని అదే పోస్టులో నియమించారని అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో జెడ్పీ సీఈఓగా నియమితులైన గనియా రాజకుమారి, డీఆర్‌ఓగా నియమితులైన వై.నర్సింహారావు ముందు జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు జెడ్పీ సీఈఓగా పనిచేసిన మోహనరావు ప్రయత్నాలు ముమ్మురం చేసి, మళ్లీ రిటెన్షన్ ఉత్తర్వులు తెచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హుటాహుటీన వచ్చి గనియా రాజకుమారి ఇక్కడి బాధ్యతల్ని స్వీకరించారు.
ఆమె ఏ మాత్రం ఆలస్యం చేసినా మోహనరావుకు రిటైన్షన్ వచ్చేదని, తిరిగి సీఈఓగా కొనసాగేవారని జెడ్పీలో ఇప్పటికీ చర్చ సాగుతోంది. డీఆర్‌ఓ వై.నర్సింహరావు విషయంలో కూడా అదే జరిగింది. వాస్తవానికి నర్సింహరావు అంతకుముందు విశాఖ అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అదే పోస్టులో కొనసాగేందుకు రిటెన్షన్ వస్తుందని ఆశించారు. ఆ దృష్ట్యా మరో పోస్టు కోసం ప్రయత్నించలేదు. కానీ అకస్మాత్తుగా ఆయన కొనసాగుతున్న ఏజేసీ పోస్టులో వేరొకర్ని నియమించేశారు. దీంతో ఆయనకు పోస్టు లేని పరిస్థితి నెలకొంది. తీవ్రంగా ప్రయత్నించి అప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న డీఆర్‌ఓ పోస్టింగ్‌ను వేయించుకున్నారు. ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఇంకొకరు వేయించుకుంటారేమోనన్న భయంతో బదిలీ ఉత్తర్వు వచ్చిన మరుసటి రోజునే విధుల్లో చేరిపోయారు. లేదంటే ఆ పోస్టులో ప్రశాంతి నియమతులయ్యే వారనే ప్రచారం జరిగిం ది.