విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోంది: గంటా
న్యూఢిల్లీ : సమైక్య రాష్ట్ర అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మరోసారి ఢిల్లీ బాటపట్టారు. ఈరోజు ఉదయం ఢిల్లీ వెళ్లిన పలువురు సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాత్రి ఏడుగంటలకు కలువనున్నారు. 60 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియ ఏకపక్షంగా సాగుతోందని.... విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కారంపై కేంద్రం స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తోందంటూ సీమాంధ్ర నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందని...అప్రజాస్వామిక విధానాన్ని నిలిపివేయాలని రాష్ట్రపతిని కోరతామన్నారు. రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతి, ఎనిమిది గంటలకు దిగ్విజయ్ను కలుస్తామన్నారు.
విభజనపై అసెంబ్లీ తీర్మాణం లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమన్నది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఆరోపణ. తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీ వ్యతిరేకిస్తే విభజన ప్రక్రియను ఆపాలంటూ రాష్ట్రపతిని సీమాంధ్ర నేతలు కోరనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌తో భేటీ కానున్న నేతలు... విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రలో కుదేలైన కాంగ్రెస్‌ను ఎలా బతికిస్తారో చెప్పాలంటూ ప్రశ్నించనున్నారు. విభజన ముసాయిదా బిల్లు నవంబర్ అఖరుకల్లా అసెంబ్లీకి రానున్న నేపధ్యంలో సమైక్య రాష్ట్ర డిమాండ్‌పై సీమాంధ్ర నేతలు చేస్తున్న ఈ తాజా ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హస్తిన చేరుకున్న వారిలో మంత్రులు గంటా శ్రీనివాసరావు,టీజీ వెంకటేష్,ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.