ప్రైవేటు చదువుల దోపిడీకి కళ్లెం! | Stop to the private schools robbery | Sakshi
Sakshi News home page

ప్రైవేటు చదువుల దోపిడీకి కళ్లెం!

Published Mon, Jul 29 2019 3:42 AM | Last Updated on Mon, Jul 29 2019 9:22 AM

Stop to the private schools robbery - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన రెండు కీలక బిల్లులను రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించనుంది. మొన్నటి ఎన్నికలకు ముందు జరిపిన తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు తమ పిల్లల చదువుల కోసం పడుతున్న బాధలను గమనించిన వైఎస్సార్‌ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ బిల్లులకు రూపకల్పన చేయించారు. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ బిల్లు ఒకటి కాగా.. రెండోది ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ బిల్లు. ఇప్పటికే అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాల అమలుతో పేదల కష్టాలను తీరుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ రెండు బిల్లుల ద్వారా మరో కీలకమైన ముందడుగు వేస్తున్నారు. అందని ద్రాక్షగా మారిన అత్యున్నత స్థాయి చదువులు ఈ బిల్లులతో పేదలకు చేరువకానున్నాయి. విద్యను వ్యాపారమయం చేసి లాభార్జనే ధ్యేయంగా తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ముకుతాడు వేయడంతో పాటు రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి విద్యా ప్రమాణాలను నెలకొల్పే దిశగా ఈ బిల్లులు రూపుదిద్దుకున్నాయి. కాగా, పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుతో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుండగా, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుతో ఏటా 25 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది. 

‘ప్రైవేటు’కు ముకుతాడు
రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలతో పేద, మధ్య తరగతుల వారికి చదువులు పెనుభారంగా మారిపోయాయి. కేజీ నుంచే భారీస్థాయిలో ఫీజులను వసూలుచేస్తున్నాయి. సెకండరీ, హయ్యర్‌ సెకండరీ స్థాయి చదువుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ చదువులు చెప్పించాల్సిన పరిస్థితి. ఇక ఉన్నత చదువులకు వచ్చేసరికి ఆయా కుటుంబాలు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ట్రస్టుల పేరిట లాభాపేక్ష లేకుండా విద్యా సంస్థలను నిర్వహించాల్సిన ఆయా కార్పొరేట్‌ సంస్థలు కోట్ల రూపాయల లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రభుత్వాలు వీటి విద్యా వ్యాపారాన్ని పట్టించుకోకుండా మౌనం దాల్చాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలు చెప్పిందే వేదంగా ప్రభుత్వాలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. పాలకులే తమ బినామీ పేరిట ఈ కార్పొరేట్‌ సంస్థలను ఏర్పాటుచేస్తుండడంతో వీటి ఆగడాలకు అంతేలేకుండాపోయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులతో వీటి దోపిడీకి అడ్డుకట్ట పడనుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు పెద్దపీట వేశారు. ఇప్పుడీ బిల్లులతో ఈ పరిస్థితి మారనుంది.

పాఠశాలలు, కాలేజీలు–వర్సిటీలకు వేర్వేరుగా కమిషన్లు
ప్రతి విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అన్ని మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూలు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు ఈ బిల్లుల ద్వారా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేయనున్నారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ.. ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటుకానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను సోమవారం చర్చ అనంతరం ఆమోదించనున్నారు. కాగా, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలు ఈ కమిషన్లకు చైర్మన్లుగా ఉంటారు. ఆయా రంగాల్లో నిపుణులు, మేథావులను సభ్యులుగా నియమించనున్నారు. వీటికి సివిల్‌ కోర్టు అధికారాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన ప్రమాణాలతో విద్యావకాశాలను కల్పించడం, విద్యాసంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం సుస్థిరమైన విద్యాభివృద్ధి సాధన, లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ప్రధాన లక్ష్యం. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం ఆయా విద్యాసంస్థల్లో పేదలకు 25 శాతం సీట్లు ఉచితంగా అందించేలా ఈ కమిషన్లు చర్యలు చేపడతాయి. ఆయా సంస్థల్లో పనిచేసే టీచర్లు, వారి అర్హతలు, వారికి చెల్లిస్తున్న జీతాలు ఇతర అంశాలన్నిటినీ కమిషన్‌ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటుచేస్తుంది. నిబంధనలు అసలు పాటించని సంస్థల గుర్తింపును సైతం రద్దుచేస్తుంది. సివిల్‌కోర్టు అధికారాలు కల్పిస్తున్నందున ఎవరినైనా పిలిపించి విచారించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. 

ఇంటర్‌లో దోపిడీకి కళ్లెం
కొత్త విధానంలో ఇంటర్మీడియెట్‌ విద్యను ఉన్నత విద్య పరిధిలోకి తెస్తున్నారు. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఈ కాలేజీల వ్యవహరాలను పరిశీలిస్తుంది. ఇప్పటివరకు వీటిపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలలు రాజ్యమేలుతున్నాయి. అలాగే, ప్రైవేటు వర్సిటీలు కూడా. ఈ బిల్లుల ద్వారా కమిషన్‌ ఏర్పాటుతో వాటికీ అడ్డుకట్ట పడనుంది. అలాగే.. డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీలు సహ అన్ని ప్రైవేటు వర్సిటీలు ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. నిబంధనలు పాటించని వాటిపై పెనాల్టీల విధింపు అధికారం కమిషన్‌కు ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement