విద్యా వ్యవస్థకు నవోదయం | Establishment of commissions for transforming the education sector | Sakshi
Sakshi News home page

విద్యా వ్యవస్థకు నవోదయం

Published Tue, Jul 30 2019 3:11 AM | Last Updated on Tue, Jul 30 2019 12:54 PM

Establishment of commissions for transforming the education sector - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో నవశకం ఆరంభమైంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా ప్రభుత్వం నాంది పలికింది. ఇందుకు సంబంధించి చరిత్రాత్మకమైన రెండు కీలక బిల్లులను శాసనసభ సోమవారం ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లు.. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందాయి. దీంతో ఇంత కాలం విద్యార్థులు, తల్లిదండ్రులను ఫీజుల పేరిట పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట పడనుంది. ఎన్నికలకు ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలోని విద్యా రంగ పరిస్థితిని, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను కళ్లారా చూసి చలించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రెండు బిల్లులకు రూపకల్పన చేసి, తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఆమోదింపజేశారు.

ఎల్‌కేజీ మొదలు ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత చదువుల వరకు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అనేక అవస్థలు పడుతున్నారు. ఆస్తులు సైతం అమ్ముకోవడమే కాకుండా ఆ చదువులు పూర్తయ్యేసరికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారమయం చేయడంతో పేదలే కాకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సైతం విద్య పెనుభారంగా మారింది. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడంతో పాటు ఇష్టానుసారం ఫీజులు దండుకొనే స్వేచ్ఛను సైతం ఇచ్చేసింది. కనీస సదుపాయాలు, బోధకులు లేకుండానే కాలేజీలు, స్కూళ్లను నిర్వహిస్తున్నాయి. పిల్లలను జైళ్ల వంటి హాస్టళ్లలో ఉంచి వారిపై విపరీతమైన ఒత్తిడి పెడుతూ వారి బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. సరైన బోధన లేకుండా బట్టీ పద్ధతులను పాటిస్తూ విద్యార్థులను యంత్రాలుగా మార్చేస్తున్నాయి. 

రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు
పాఠశాల, ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ బిల్లులు ఆమోదం పొందడంతో ఇకపై రాష్ట్రంలో విద్యా రంగ రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలే ప్రామాణికంగా విద్యా రంగం పయనిస్తుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లులు రాష్ట్ర  చరిత్రలో కీలక మలుపుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఈ కమిషన్లకు ప్రభుత్వం అనేక అధికారాలు కల్పించింది. ఫీజులు, ప్రమాణాలు, విద్యార్థులు.. టీచర్ల సంక్షేమం ఇలా అన్ని కోణాల్లోనూ ఈ కమిషన్లు విద్యారంగాన్ని పర్యవేక్షిస్తాయి. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలు ఛైర్మన్లుగా ఉండడంతో పాటు ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనుండడంతో విద్యారంగం పగడ్బందీగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీటికి సివిల్‌ కోర్టు అధికారాలను కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. 

– రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అధికారం విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉంటుంది. 
– కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు మినహా తక్కిన అన్ని సంస్థలు ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి.
– ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల సర్వీసు కండిషన్లు, వారికి ఇస్తున్న వేతనాలు, ఇతర అంశాలను కూడా కమిషన్‌ పరిశీలిస్తుంది. 
– ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. నిబంధనలు అసలు పాటించని సంస్థల గుర్తింపు రద్దుకు కూడా చేసే అధికారం ఉంటుంది.
– సివిల్‌ కోర్టు అధికారాలు కల్పిస్తున్నందున ఎవరినైనా పిలిపించి విచారించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. 

ఇంటర్‌లో దోపిడీకి బ్రేకులు
ప్రస్తుతం పాఠశాల విద్య ఒక ఎత్తు అయితే ఇంటర్మీడియెట్‌ విద్య మరో ఎత్తు. రెండేళ్ల ఈ కోర్సు పేరిట ప్రవేట్, కార్పొరేట్‌ సంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇప్పుడీ కోర్సును ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఈ కాలేజీల వ్యవహరాలను పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్మీడియెట్‌ కాలేజీలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాల ఇష్టానుసారం అయ్యింది. అలాగే ప్రైవేటు వర్సిటీలు కూడా ఈ రాష్ట్రంతో, ప్రభుత్వంతో సంబంధం లేనట్లు ఇష్టానుసారంగా ఫీజులు, ప్రవేశాలను కొనసాగిస్తున్నాయి. ఈ కమిషన్‌ ఏర్పాటుతో వాటికీ అడ్డుకట్ట పడనుంది. 

– ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్‌ చర్యలు చేపడుతుంది.
– ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, బోధనా సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల నిర్వహణ ఉందా? లేదా అన్న అంశాల పరిశీలన.
– జూనియర్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు (రాష్ట్ర చట్టాలకు లోబడి ఏర్పాటైనవి) కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి.
– ఆయా సంస్థలపై చర్యలకు కమిషన్‌కు అధికారం ఉంటుంది. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థల మూతకు చర్యలు తీసుకొనే అధికారం కమిషన్‌కు ఉంది. 
– నిబంధనలు పాటించని ఉన్నత విద్యా సంస్థలకు పెనాల్టీల విధింపు అధికారం ఉంది.
– నిబందనలు ఉల్లంఘించే సంస్థల గుర్తింపు రద్దుకు వర్సిటీలను ఆదేశించే అధికారం. చైర్మన్, సభ్యులపై లేదా కమిషన్‌పై న్యాయపరమైన కేసులు దాఖలు చేసేందుకు వీలులేదు.
– నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం నడిచే విద్యా సంస్థలను మూత వేసే అధికారం ఉంటుంది. పెనాల్టీలను విధిస్తుంది. వాటిని కట్టకుంటే వాటి నిధులను, లేదా స్థలాలను స్వాధీనం చేసుకొనే అధికారం కూడా ఉంది. కాగా, కమిషన్‌ నిర్ణయాలను పరిశీలించే, సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.

ఇప్పటిదాకా ఇదీ పరిస్థితి
– కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదు.
– రకరకాల పేర్లతో 1 నుంచి 5వ తరగతి వరకు రూ.80 వేలు, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.1లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు.
– తమ తరఫున ఏజెంట్లను గ్రామీణ ప్రాంతాలకు పంపుతూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయి.
– జిల్లా కేంద్రాల్లో ఒకటో తరగతిలోనే రూ.30 వేలకు పైగా వసూలు చేస్తుండగా అది పదో తరగతికి చేరేసరికి లక్షకు చేరుతోంది.  
– ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లోని 90 శాతం వాటికి ఆట స్థలాలు లేవు. అర్హత కలిగిన బోధనా సిబ్బంది లేరు. 
–  ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్‌ స్కూల్‌ తదితర ఆకర్షణీయ పేర్లతో భారీగా ఫీజులు దండుకుంటున్నారు. ఈ పేర్లను తొలగించాలని ఆదేశాలున్నప్పటికీ అమలు కాలేదు. 
–  ప్రభుత్వ సెలవు దినాలు, కేలండర్‌ను అమలు చేయకపోయినా ఎక్కడా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement