వైఎస్సార్‌సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, అనంత వెంకటరామిరెడ్డి
* రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
* ఎంతసేపూ ‘ఓటుకు కోట్లు’ నుంచి బయటపడడంపైనే సీఎం దృష్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనుమతుల్లేకుండా శంకుస్థాపన చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తక్షణం ఆపించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం నుంచి బయటపడటానికి నిత్యం కృషిచేస్తున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. పాలమూరు కారణంగా రాయలసీమ, నాగార్జునసాగర్ కింద ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు నష్టపోతారని ఆందోళన వెలిబుచ్చారు. సాగునీటి మంత్రి దేవినేని ఉమా ఈ ప్రాజెక్టుపై ఒకే ఒక్కసారి విలేకరుల భేటీలో అభ్యంతరం తెలిపి వదిలేశారని, సీఎం ఇంతవరకూ దీనిపై నోరువిప్పిన పాపానపోలేదని తప్పుపట్టారు.
ఉమ్మ డి రాష్ట్రంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుకు అనుమతులొచ్చాయని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పి పక్కదోవ పట్టించారని, ఆయన చెప్పింది నిజం కానేకాదని వారు స్పష్టం చేశారు. ‘పాలమూరు’పై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేయలేదని వారు విమర్శించారు. తెలంగాణలో టీడీపీని కాపాడుకోవడంకోసం చంద్రబాబు ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు.
జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడమేంటి?
‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోతే జగన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడమేమిటని సుబ్బారాయుడు ప్ర శ్నించారు. రాజకీయ దొంగతనం చేస్తూ పట్టుబడిన చంద్రబాబు దాన్నుంచి తప్పించుకోవడానికి ఏపీప్రజల్ని అడ్డం పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.