ఏపీభవన్‌లో సీఎంను కలిసి వస్తున్న అమర్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఊహించిందే జరుగుతోంది. లక్షల మంది డిపాజిటర్ల ఆశలను అడియాసలు చేసే దిశగా తెర వెనుక పావులు కదులుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణలోనే ఇది జరుగుతుండటం గమనార్హం. ప్రత్యేక హోదా సాధన పేరుతో ఇటీవల ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఆ సంగతి పక్కనపెట్టి అగ్రిగోల్డ్ వ్యవహారాల్లో తీరికలేకుండా గడిపారు. సుభాష్‌చంద్ర ఫౌండేషన్ చైర్మన్ సుభాష్ చందర్‌జీ, ప్రముఖ రాజకీయ నేత అమర్ సింగ్‌లతో చంద్రబాబు తను బస చేసిన చోట రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా తాజాగా వెలుగు చూశాయి. అగ్రిగోల్డ్ ఆస్తులను ఎలా దక్కించుకోవాలన్న అంశంపై మంతనాలు సాగించినట్లు సమాచారం.
వెనక్కి తగ్గింది అందుకే..
తాము అనుకున్న పథకాన్ని అమలు చేసేందుకు అమర్‌సింగ్, సుభాష్‌లతో చంద్రబాబు భేటీ తరువాత సుభాష్ చంద్ర ఫౌండేషన్ కొత్త డ్రామాకు తెరలేపింది. అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలను టేకోవర్ చేస్తామంటూ హైకోర్టు సాక్షిగా చెప్పిన ఆ సంస్థ అందులో భాగంగానే అకస్మాత్తుగా వెనక్కి తగ్గింది. అగ్రిగోల్డ్ ఆస్తులకు, అది చెల్లించాల్సిన అప్పులకు పొంతనే లేదని, అగ్రిగోల్డ్ టేకోవర్ తమకు ఆర్థికంగా ఎంతమాత్రం లాభసాటి కాదంటూ చేతులెత్తేసింది. ఇదే సమయంలో డిపాజిటర్ల పేరు చెప్పి అమర్‌సింగ్‌ను తెరపైకి తెచ్చింది.
అమర్‌సింగ్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని కోర్టుకే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–తమ ఫౌండేషన్ సంయుక్తంగా అగ్రిగోల్డ్ స్థిరాస్తులను అభివృద్ధి చేసేలా అమర్‌సింగ్ చర్చలు జరుపుతున్నారని కూడా తెలిపింది. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనను బట్టి అగ్రిగోల్డ్ గ్రూపులో పెట్టుబడులపై పునరాలోచన చేస్తామంది. సుభాష్‌చంద్ర ఫౌండేషన్ అమర్‌సింగ్ పేరును తెరపైకి తేవడంపై న్యాయమూర్తులు సైతం ఒకింత విస్మయానికి గురయ్యారు. కోర్టులో ఉన్న డిపాజిటర్లు ఖంగుతిన్నారు. ఈ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన హైకోర్టు... తెర వెనుక వ్యక్తులతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం వైపు నుంచి కొన్ని విషయాలను నిర్ధారించుకునేందుకు వివరణ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment