
‘శీతాకాలం’లోనే టీ -బిల్లు
తెలంగాణ జేఏసీ నేతలతో దిగ్విజయ్
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రక్రియను పూర్తిచేస్తామని, వాయిదాలుండవని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. విభజనపై అనుమానాలొద్దని, ఆ ప్రక్రియ పూర్తరుునట్టేనని చెప్పారు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే జనవరి మొదటి వారంలోనే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో గురువారం తనను కలిసిన తెలంగాణ జేఏసీ నేతలతో సుమారు అరగంటకుపైగా ఆయన చర్చించారు. రాష్ట్ర విభజన గడువు, ముసాయిదా బిల్లులో సవరణలు, విభజన అనంతరం రాజకీయ పరిస్థితులు, జేఏసీ మద్దతు, జేఏసీలో ఆశావహులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం వంటి అంశాలు ప్రస్తావనకొచ్చారుు.
ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, జేఏసీ చైర్మన్ ఎం. కోదండరాం, నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, సి. విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, రాజేందర్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, వి. మమత, దేవీప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, మాదు సత్యం, రసమయి బాలకిషన్, ఎం. మణిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీ.జేఏసీ నేతలు అందించిన సమాచారం ప్రకారం.. ‘అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలకు తక్కువ సమయమే ఉంది కదా? శీతాకాల సమావేశాల్లోనే విభజన ప్రక్రియ పూర్తి అవుతుందా?’ అని ప్రశ్నించగా.. ‘మీరు చూస్తున్నారు కదా.. వీలైనంత వేగంగా విభజన ప్రక్రియను పూర్తిచేయాలనుకుంటున్నాం. ఈ సమావేశాల్లోనే చర్చలు పూర్తవుతాయి. ఇతర ప్రాంతాల సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంటుంది కదా. విభజన అంశాన్ని పక్కనబెట్టి వేరే ఇతర సమస్యలేమైనా ఉంటే చెప్పండి’ అని దిగ్విజయ్ అన్నారు.
ఇప్పుడు మీ పనికోసం... తర్వాత మా పనికోసం వస్తా
తెలంగాణ విభజన తర్వాత రాజకీయ పరిస్థితులపై, జేఏసీ నేతల భవిష్యత్తుపై దిగ్విజయ్ ఆరాతీశారు. విభజన వల్ల ఏ పార్టీకి లాభం అని, కాంగ్రెస్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘ఇప్పుడు వచ్చింది మీ పనికోసం (తెలంగాణ ఏర్పాటుకోసం). భవిష్యత్తులో మా పనికోసం వస్తా. మీ మద్దతు కావాలి. మీరు మాతో ఉన్నారా? లేదా?’ అని అడిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత తమతో పాటు తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్‌కు కృతజ్ఞులై ఉంటారని జేఏసీ నేతలు సమాధానం ఇచ్చారు. ‘ప్రజలు కోరుకున్నట్టుగా, శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ ఇస్తే వారు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారు. అయితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరువల్ల నష్టం జరుగుతోంది. ఆయనను కట్టడి చేయండి’ అని కోరారు. ఎన్నికల్లో టికెట్టు కోసం తీవ్రస్థాయిలో పోరాడుతున్న ఒక జేఏసీ నాయకుడు.. ‘తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ బలపడ్డది. ఇందిరాగాంధీ స్థాయిలో సోనియాగాంధీకి ప్రతిష్ట పెరిగిపోయింది’ అంటూ పొగిడారు. జేఏసీ నేతలు ఎవరికైనా రాజకీయంగా ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో తాము అవకాశాలు కల్పిస్తామని దిగ్విజయ్ చెప్పారు.
బిల్లుకు సవరణలు కోరిన నేతలు
ఉమ్మడి హైకోర్టు కుదరదని, ఉద్యోగుల విభజనపై స్పష్టత ఇచ్చే విధంగా ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని జేఏసీ నేతలు దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. నదీ జలాల పంపకం, నిర్వహణకు ప్రత్యేక బోర్డు ఉంటే అభ్యంతరంలేదని నివేదించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2 లేదా 3 ఏళ్లు చాలునన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు, కేంద్ర కేబినెట్‌కు, కాంగ్రెస్ పార్టీ నేతలకు జేఏసీ నాయకులు కృతజ్ఞత లు తెలిపారు.
టీఆర్‌ఎస్ భవితవ్యమేమిటి?: తెలంగాణలో టీఆర్‌ఎస్ భవితవ్యం, కాంగ్రెస్‌తో ఆ పార్టీ సంబంధాలు ఎలా ఉంటాయంటూ తిరునావుక్కరసును జేఏసీ నేతలు ప్రశ్నించారు. ‘టీఆర్‌ఎస్ విలీనమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది సాధ్యం కాకుంటే విడిగానే పోటీచేస్తారు. పొత్తువల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు’ అని ఆయన చెప్పారు. కాగా, దిగ్విజయ్‌ను కలిసి బయటకు వస్తున్న జేఏసీ నేతలకు కేవీపీ రామచంద్రరావు ఎదురయ్యారు. ఆయనే కల్పించుకుని.. ‘పక్క రాష్ట్రానికి చెందిన మమ్ములను కూడా దృష్టిలో పెట్టుకోండి. తెలంగాణ వాళ్లతోనే మాట్లాడతామంటే ఎలా? భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. ఏఐసీసీ కార్యదర్శులుగా మీ రాష్ట్రానికి ఇన్‌చార్జిలుగా మేమే రావొచ్చు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
దామోదర, జానా, నారాయణతో జేఏసీ నేతల భేటీ
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఐక్యంగా ఉండాలని కోరేందుకుగాను సీపీఐ, కాంగ్రెస్ నేతలను గురువారం జేఏసీ నేతలు కలిశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి కె.జానారెడ్డితో జేఏసీ నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బిల్లుపై త్వరగా చర్చలు ముగిసేందుకు, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకుగాను తెలంగాణ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని కోరారు. తెలంగాణకు తాము మద్దతుగా ఉన్నామని, దీనిపై అసెంబ్లీలో అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, శాసనసభాపక్ష నాయకులు గుండా మల్లేష్ హామీనిచ్చారు. సభలో అవసరమైన అన్ని వ్యూహాలను అమలుచేస్తామని, ఏమైనా సాంకేతిక అంశాలుంటే వెంటనే సలహాలు ఇచ్చి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి జానారెడ్డి జేఏసీ నేతలను కోరారు.