
రాయదుర్గం టీడీపీ నేతల్లో అభద్రతాభావం నెలకొంది. వారిలో కొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో పావులు కదుపుతున్నారు. వైఎస్సార్‌సీపీకి పట్టున్న గ్రామాల్లో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వారి పాచికలు పారనిచోట ఓట్లు తొలగించే కుటిలయత్నం చేస్తున్నారు. ఆ దిశగా శనివారం రాయదుర్గం మండలంలోని కాశీపురం గ్రామంలో వివరాలు సేకరిస్తున్న కొందరు మహిళలను గ్రామస్తులు నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాయదుర్గం రూరల్: టీడీపీ నాయకులు అనంతపురానికి చెందిన ఆరుగురు మహిళలను తీసుకొచ్చి రాయదుర్గం మండలంలోని కెంచానపల్లి, కాశీపురం, వేపరాల గ్రామాల్లో సర్వే చేయించాలని ఆదేశించారు. ఆ మేరకు వారు కాశీపురంలో ఇంటింటికీ వెళ్లి ఏ పార్టీకి ఓటు వేస్తారు? అని అడుగుతూ ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డులు తీసుకుని ఓటర్ల జాబితాలో ఏదో రాసుకుంటూ పోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు సత్యనారాయణ సర్వే చేస్తున్న మహిళల వద్దకెళ్లి ‘మీరు ఏ డిపార్ట్‌మెంట్ వారు? మిమ్మల్ని ఎవరు, ఎందుకు పంపించారు?, రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులతో మీకేం పని?’ అంటూ ప్రశ్నించారు.
దీంతో గ్రామస్తులకు కూడా అనుమానం వచ్చి ‘ఓటరు కార్డు తీసుకుని మీరేం చేస్తున్నారు? అని నిలదీశారు. దీంతో నోరు విప్పిన మహిళలు చంద్ర అనే వ్యక్తి చెప్పడంతో ఈ సర్వే చేస్తున్నామన్నారు. తాము కేవలం డోర్ నెంబర్ మాత్రమే తీసుకుని ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారా, లేదా అని పరిశీలిస్తున్నామని, కొందరు తెలియక గుర్తింపుకార్డులు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. వారి వైఖరి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు గుమికూడారు. రాజకీయ పార్టీలపై సర్వే చేస్తున్నారని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మల్లికార్జున మండల ప్రధాన కార్యదర్శి కొండాపురం రామన్న, శివారెడ్డి, వడ్డే హనుమంత, తిప్పేస్వామి తదితరులతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. సర్వే చేయరాదని మహిళలకు సూచించారు. సర్వే విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. ఒక జాతీయ ఛానల్ రాజకీయ పార్టీలపై సర్వే చేయాలని కోరడంతో ఏ పార్టీకి ఓటు వేస్తారనే విషయం మాత్రమే అడగాలని మహిళలకు సూచించామని, ఆధార్, రేషన్, ఓటరు కార్డులు తీసుకోవాలని చెప్పలేదని టీడీపీ నాయకుడు చంద్ర చెప్పుకొచ్చారు.
ఓటు తొలగిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు?
పూర్తి వివరాలు సేకరించాక ఓటర్ల జాబితాలో మా పేర్లను తొలగిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు ఎలా చేస్తారు. మాకు చదువు లేదూ.. సంధ్యా లేదు. ఎవరు ఎందుకు వస్తున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.
– కృష్ణవేణి, కాశీపురం
అధికారులు అవగాహన కల్పించాలి
ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అధికారులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజలను అప్రమత్తం చేయాలి.ఎవరైనా మీ వద్దకొచ్చి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఓటరుకార్డులు కాని అడిగితే ఇవ్వరాదని అధికారులు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచాలి. ఎవరైనా సర్వేకు వస్తే వారి వివరాలను తమకు అందించాలని తెలియజేయాలి.
– యశోదమ్మ, కాశీపురం గ్రామం
వారికి అనుకూలంగా రాసుకోవడానికి
ఏదోకటి రాసుకెళ్లి టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయించుకుని వైఎస్సార్‌సీపీ ఓటర్లను తికమక పెట్టేందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నట్టున్నారు. గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి సర్వేలు చేయించుకోవాల్సిన అవసరం ఏముంది?
– నాగలక్ష్మీ, కాశీపురం
Comments
Please login to add a commentAdd a comment