- గుంటూరులో ఖరారు కాని అభ్యర్థులు మిగతా జిల్లాలు ఓకే
- కృష్ణా జిల్లాలో అర్జునుడు స్థానంలో బుద్ధా వెంకన్నకు అవకాశం?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏపీలో స్థానిక సంస్థల కోటా కింద 11 సాధారణ, ఒక ఉప ఎన్నిక కు ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. ఈ స్థానాల్లో పయ్యావుల కేశవ్ (అనంతపురం), వైవీబీ రాజేంద్రప్రసాద్ (కృష్ణా), రెడ్డి సుబ్రహ్మణ్యం (తూర్పు గోదావరి), నెల్లిమర్ల సత్యం (విజయనగరం), పప్పల చలపతిరావు (విశాఖపట్నం), గాలి ముద్దుకృష్ణమనాయుడు (చిత్తూరు), మాగుంట శ్రీనివాసులురెడ్డి (ప్రకాశం)లను అభ్యర్థులుగా ఎంపిక చేశారు.
ఉప ఎన్నిక జరిగే కర్నూలు స్థానం నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేయనున్నారు. కృష్ణా జిల్లాలో రెండో స్థానం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు యాదవ్ పేరు ఖ రారు చేసినట్లు పార్టీవర్గాలు మీడియాకు గతంలో సమాచారం అందించాయి. అయితే ఇపుడు ఆయన స్థానంలో విజయవాడ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బుద్ధా వెంకన్నను అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.