ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో రాష్ట్రేతర కవుల సందడి
‘సాక్షి’తో మనోభావాలు పంచుకున్న రచయితలు, సాహితీమూర్తులు
అక్షరానికి అభిషేకం జరిగింది. అమ్మలగన్నఅమ్మ కనకదుర్గమ్మ పాదాల చెంతన తెలుగు వైభవం వేయి వేణువుల గానమై మార్మోగింది... ఇదీ రెండు రోజుల పాటు పటమటలోని కృష్ణవేణి పాఠశాలలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మూడో మహాసభల్లో కవులు, రచయితల నోట జాలు వారిన ప్రశంసల జల్లు. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలు తెలుగువారి గుండె తలుపులను తట్టాయి. సుమారు 1500మందికిపైగా రచ యితలు, భాషావేత్తలు పాల్గొని తెలుగు భాషావ్యాప్తి, పరిరక్షణ, పరిపుష్టత అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు, సాహితీమూర్తులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
- వన్‌టౌన్/భవానీపురం/విజయవాడ కల్చరల్
పదజాలంలో మార్పు అవసరం
ప్రసార మాధ్యమాల్లో వస్తున్న పదజాలం అభ్యంతరంగా ఉంటోంది. చర్చా వేదికల్లో కూడా వాడకూడని పదజాలాన్ని వాడుతున్నారు. వాటిని చూస్తున్న యువత అదే తెలుగు భాష అనుకునే ప్రమాదం ఉంది. ఆరు నుంచి కనీసం ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి. ఇంటర్‌లో తెలుగు ఉంటే.. ఆ విద్యార్థికి భాషపై పట్టు వస్తుంది. ఇంటర్‌లో తెలుగు తీసుకుంటేనే ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో సీటుకు అర్హతగా ప్రకటించాలి. నాగపూర్‌లో తెలుగువారు చాలామందే ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ఇటువంటి మహాసభలు నిర్వహిస్తే అక్కడ నివసించే తెలుగువారికి బలం ఏర్పడుతుంది. సమాజాన్ని, వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే యువతకు తెలుగు రాకపోతే భవిష్యత్‌లో పరిపాలన ఎలా సాగుతుంది. ప్రభుత్వపరంగా తెలుగు తప్పనిసరి చెయ్యాలి.
- డాక్టర్ ఎన్‌ఎన్ మూర్తి, విద్యా వాచస్పతి, నాగపూర్
పాత్రికేయులకు కృతజ్ఞులం..
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాత్రికేయ లోకం ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ప్రతి మాధ్యమం తమ స్థాయిలో సహకరించాయి. సామాన్యుడికి కూడా ఈ సభల సందేశాన్ని చేర్చాయి. వారంతా ఇందులో మమేకమయ్యేలా పురిగొల్పాయి. మహాసభల వార్తలు గమనించిన దేశవిదేశాల నుంచి వచ్చిన భాషాభి మానులు, భాషావేత్తలు చరవాణిల ద్వారా తమ ఆనందానుభూతులను మాతో పంచుకున్నారు. ఇందుకు పాత్రికేయులకు మేము కృతజ్ఞులం. అయితే, కొంతమంది పెద్ద రచయితలు తమను పిలవాలి, పెద్దపీట వేయాలనే భావనతో దూరంగా ఉన్నారు. మన మాతృభాష పరిరక్షణకు జరిగిన ఈ సభల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ మహాసభలు అనుకున్న లక్ష్యాన్ని సాధించాయని మేము భావిస్తున్నాం.
- గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచందు,
కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా తెలుగు ప్రచురణలు
కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 360 తెలుగు పుస్తకాలను ప్రచురించాం. తెలుగులో అనువాదాల సంఖ్య పెరగాలి. అలా అయితేనే సాహిత్యం దూరప్రాంతాల వారికి దగ్గరవుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు రచయితలను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీ ఉంది. దాని నిర్ణయం ద్వారానే అవార్డులు ఇస్తాం.
- కె.శ్రీనివాసరావు,
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహకుడు, ఢిల్లీ
తెలుగు గర్వంగా మాట్లాడాలి
మాతృభాషలో మాట్లాడటం, సంతకం చేయడం గర్వంగా భావించాలి. ఇతర భాషా సంస్కృతులను అధ్యయనం చేయాలి. తెలుగు పద సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించాలి. దేశ విదేశాల్లో నివసించేవారు, వారి పిల్లల కోసం ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించాలి. భాష చనిపోతోందని బాధపడే ఆలోచన పక్కన పెట్టి భాషకు ఏం చేస్తున్నాం.. అనే ఆలోచన చేయాలి.
- డాక్టర్ రవికుమార్ వేలూరి, వైద్యనిపుణుడు, అమెరికా
ఒడిశాలో తెలుగు వెలగాలి
ఒడిశాలో తెలుగువ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందించాలి. అక్కడి తెలుగువారు తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించుకోవాలని తాపత్రయపడుతున్నారు. అయితే, అక్కడ తెలుగు బోధించే ఉపాధ్యాయులు ఉన్నా... పుస్తకాలు, తదితర సామగ్రి అందుబాటులో లేవు. ప్రభుత్వం స్పందించి ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారికి అండగా నిలవాలి. తెలుగు పాఠశాలలకు సహకారం అందించాలి.
- సింహాద్రి శ్రీనివాసరావు, తెలుగు భాషోద్యమ నేత, ఒడిశా
అలా చేస్తేనే మంచిరోజులు..
కాలచక్రంలో తెలుగు సంస్కృతి తగ్గిపోతోంది. ఎవరికివాళ్లు మన ఒక్కరి వల్లే తెలుగు బాగుపడుతుందా.. అనుకుని ఊరుకుంటే కష్టం. ప్రతి ఒక్క తెలుగువారు మాతృభాషాభివృద్ధికి కృషిచేయాలి. తెలుగుకు ప్రాధాన్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రపంచస్థాయిలో తెలుగు రచయితల మహాసభలు జరపడం చారిత్రక అవసరం. తెలుగును పాఠ్యాంశంగా చేయడం, కేవలం పాఠశాలల్లోనే కాకుండా డిగ్రీ. వృత్తి విద్యా కోర్సుల్లోనూ తప్పనిసరి చేయడం వంటి ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే తెలుగు భాషకు గౌరవం ఏర్పడుతుంది. ఇలాంటి పనులకు ప్రభుత్వం పూనుకుంటే తెలుగుకు మంచి రోజులొస్తాయి. - ఓల్గా, రచయిత్రి, హైదరాబాద్
బోధన తెలుగులోనే జరగాలి
కార్పొరేట్ విద్యాసంస్థల్లోనూ తెలుగు బోధన జరిగినప్పుడే తెలుగు భాషా వికాసం సాధ్యమవుతుంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అద్భుతంగా జరిగాయి. అర్థవంతమైన సదస్సులు, సాహితీమూర్తుల ప్రసంగాలు అందరిలో భాషా వ్యాప్తిని కలిగించాయి. ప్రాథమిక పాఠశాలలోనే తెలుగు బీజం పడాలి. తెలుగు బోధన తప్పనిసరి చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం చట్టం చేయాలి. టెక్నో, ఇంటర్నేషనల్ వంటి పేర్లతో వచ్చే విద్యాసంస్థల్లో తెలుగు బోధన జరగాలంటే ప్రభుత్వం తలచుకోవాలి. తెలుగు భాషా వ్యాప్తికి నేను నా స్థాయిలో పాటుపడుతున్నాను.
- గుమ్మడి గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, హైదరాబాద్
వెలుగులీనిన తెలుగు
Published Tue, Feb 24 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement