అదుపు అదుపు మాట పొదుపు...
వివాదం
రచయితలు మాట్లాడటం కష్టమైపోతోంది. నోరు తెరిస్తే రకరకాల నిర్బంధాలు, బెదిరింపులు, ముఠాలు కట్టి దాడులు చేయడాలు, రచయిత గనక ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే మేనేజ్‌మెంట్లకు గుంపుగా కంప్లయింటు చేసి ఉద్యోగం ఊడపీకించటాలు చేయడానికి సిద్ధమైపోతున్నారు. తాజాగా శోభా డే ఆ దాడిని ఎదుర్కొంటోంది. ఇటీవల మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఒక తాకీదు ఇచ్చింది. ‘మల్టీప్లెక్సుల్లో ప్రైమ్‌టైమ్‌లో మరాఠీ సినిమాలు ప్రదర్శించాల్సిందే’ అనేది ఆ తాకీదు. దానికి జవాబుగా శోభా డే- ‘అయ్యా ముఖ్యమంత్రి గారూ... నాకు మరాఠీ సినిమాలంటే ఇష్టం. కాని వాటిని ఎప్పుడు చూడాలో ఎక్కడ చూడాలో నేను నిర్ణయించుకుంటాను. మధ్య మీ జబర్దస్తీ ఏమిటి? చూడబోతే ఇక మీదట మల్టీప్లెక్సుల్లో పాప్‌కార్న్ కూడా వద్దంటారా?
వడ పావ్, దహి మిసాల్ తినమంటారా?’ అంటూ నిరసన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. దాంతో శివసేన కార్యకర్తలు ఆమె ఇంటి ముందు వడ పావ్, దహి మిసాల్ (మహరాష్ట్ర తినుబండారాలు) పట్టుకొని ప్రదర్శనకు దిగారు. మహారాష్ట్ర సంస్కృతిని అవమానించిందంటూ క్షమాపణకు డిమాండ్ చేశారు. శివసేన పత్రిక సామ్నా అయితే ‘మహరాజా శివాజీ, బాల్ ఠాక్రేలాంటి వాళ్లు ఈ మహారాష్ట్ర సంస్కృతిని కాపాడకపోయి ఉంటే నువ్వు పాకిస్తాన్‌లో పుట్టి ఉండేదానివి. ఇవాళ పేజ్ 3 పార్టీలకు బుర్ఖాతో హాజరయి ఉండేదానివి’ అని ఘాటుగా విమర్శించింది. ఇది చినికి చినికి గాలివానయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను జైలుకు పంపాల్సిందే అని కొందరు పట్టుబడుతున్నారు. ఏదో తేడా కొడుతోంది. ఇవి రచయితలకు మంచిరోజులు కావనిపిస్తోంది.