The authors
-
అదుపు అదుపు మాట పొదుపు...
వివాదం రచయితలు మాట్లాడటం కష్టమైపోతోంది. నోరు తెరిస్తే రకరకాల నిర్బంధాలు, బెదిరింపులు, ముఠాలు కట్టి దాడులు చేయడాలు, రచయిత గనక ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే మేనేజ్మెంట్లకు గుంపుగా కంప్లయింటు చేసి ఉద్యోగం ఊడపీకించటాలు చేయడానికి సిద్ధమైపోతున్నారు. తాజాగా శోభా డే ఆ దాడిని ఎదుర్కొంటోంది. ఇటీవల మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఒక తాకీదు ఇచ్చింది. ‘మల్టీప్లెక్సుల్లో ప్రైమ్‌టైమ్‌లో మరాఠీ సినిమాలు ప్రదర్శించాల్సిందే’ అనేది ఆ తాకీదు. దానికి జవాబుగా శోభా డే- ‘అయ్యా ముఖ్యమంత్రి గారూ... నాకు మరాఠీ సినిమాలంటే ఇష్టం. కాని వాటిని ఎప్పుడు చూడాలో ఎక్కడ చూడాలో నేను నిర్ణయించుకుంటాను. మధ్య మీ జబర్దస్తీ ఏమిటి? చూడబోతే ఇక మీదట మల్టీప్లెక్సుల్లో పాప్‌కార్న్ కూడా వద్దంటారా? వడ పావ్, దహి మిసాల్ తినమంటారా?’ అంటూ నిరసన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. దాంతో శివసేన కార్యకర్తలు ఆమె ఇంటి ముందు వడ పావ్, దహి మిసాల్ (మహరాష్ట్ర తినుబండారాలు) పట్టుకొని ప్రదర్శనకు దిగారు. మహారాష్ట్ర సంస్కృతిని అవమానించిందంటూ క్షమాపణకు డిమాండ్ చేశారు. శివసేన పత్రిక సామ్నా అయితే ‘మహరాజా శివాజీ, బాల్ ఠాక్రేలాంటి వాళ్లు ఈ మహారాష్ట్ర సంస్కృతిని కాపాడకపోయి ఉంటే నువ్వు పాకిస్తాన్లో పుట్టి ఉండేదానివి. ఇవాళ పేజ్ 3 పార్టీలకు బుర్ఖాతో హాజరయి ఉండేదానివి’ అని ఘాటుగా విమర్శించింది. ఇది చినికి చినికి గాలివానయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను జైలుకు పంపాల్సిందే అని కొందరు పట్టుబడుతున్నారు. ఏదో తేడా కొడుతోంది. ఇవి రచయితలకు మంచిరోజులు కావనిపిస్తోంది. -
వెలుగులీనిన తెలుగు
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో రాష్ట్రేతర కవుల సందడి ‘సాక్షి’తో మనోభావాలు పంచుకున్న రచయితలు, సాహితీమూర్తులు అక్షరానికి అభిషేకం జరిగింది. అమ్మలగన్నఅమ్మ కనకదుర్గమ్మ పాదాల చెంతన తెలుగు వైభవం వేయి వేణువుల గానమై మార్మోగింది... ఇదీ రెండు రోజుల పాటు పటమటలోని కృష్ణవేణి పాఠశాలలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మూడో మహాసభల్లో కవులు, రచయితల నోట జాలు వారిన ప్రశంసల జల్లు. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలు తెలుగువారి గుండె తలుపులను తట్టాయి. సుమారు 1500మందికిపైగా రచ యితలు, భాషావేత్తలు పాల్గొని తెలుగు భాషావ్యాప్తి, పరిరక్షణ, పరిపుష్టత అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు, సాహితీమూర్తులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. - వన్‌టౌన్/భవానీపురం/విజయవాడ కల్చరల్ పదజాలంలో మార్పు అవసరం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న పదజాలం అభ్యంతరంగా ఉంటోంది. చర్చా వేదికల్లో కూడా వాడకూడని పదజాలాన్ని వాడుతున్నారు. వాటిని చూస్తున్న యువత అదే తెలుగు భాష అనుకునే ప్రమాదం ఉంది. ఆరు నుంచి కనీసం ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి. ఇంటర్లో తెలుగు ఉంటే.. ఆ విద్యార్థికి భాషపై పట్టు వస్తుంది. ఇంటర్లో తెలుగు తీసుకుంటేనే ప్రభుత్వ ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో సీటుకు అర్హతగా ప్రకటించాలి. నాగపూర్‌లో తెలుగువారు చాలామందే ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ఇటువంటి మహాసభలు నిర్వహిస్తే అక్కడ నివసించే తెలుగువారికి బలం ఏర్పడుతుంది. సమాజాన్ని, వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే యువతకు తెలుగు రాకపోతే భవిష్యత్‌లో పరిపాలన ఎలా సాగుతుంది. ప్రభుత్వపరంగా తెలుగు తప్పనిసరి చెయ్యాలి. - డాక్టర్ ఎన్ఎన్ మూర్తి, విద్యా వాచస్పతి, నాగపూర్ పాత్రికేయులకు కృతజ్ఞులం.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాత్రికేయ లోకం ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ప్రతి మాధ్యమం తమ స్థాయిలో సహకరించాయి. సామాన్యుడికి కూడా ఈ సభల సందేశాన్ని చేర్చాయి. వారంతా ఇందులో మమేకమయ్యేలా పురిగొల్పాయి. మహాసభల వార్తలు గమనించిన దేశవిదేశాల నుంచి వచ్చిన భాషాభి మానులు, భాషావేత్తలు చరవాణిల ద్వారా తమ ఆనందానుభూతులను మాతో పంచుకున్నారు. ఇందుకు పాత్రికేయులకు మేము కృతజ్ఞులం. అయితే, కొంతమంది పెద్ద రచయితలు తమను పిలవాలి, పెద్దపీట వేయాలనే భావనతో దూరంగా ఉన్నారు. మన మాతృభాష పరిరక్షణకు జరిగిన ఈ సభల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ మహాసభలు అనుకున్న లక్ష్యాన్ని సాధించాయని మేము భావిస్తున్నాం. - గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జీవీ పూర్ణచందు, కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా తెలుగు ప్రచురణలు కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో 360 తెలుగు పుస్తకాలను ప్రచురించాం. తెలుగులో అనువాదాల సంఖ్య పెరగాలి. అలా అయితేనే సాహిత్యం దూరప్రాంతాల వారికి దగ్గరవుతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు రచయితలను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీ ఉంది. దాని నిర్ణయం ద్వారానే అవార్డులు ఇస్తాం. - కె.శ్రీనివాసరావు, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహకుడు, ఢిల్లీ తెలుగు గర్వంగా మాట్లాడాలి మాతృభాషలో మాట్లాడటం, సంతకం చేయడం గర్వంగా భావించాలి. ఇతర భాషా సంస్కృతులను అధ్యయనం చేయాలి. తెలుగు పద సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించాలి. దేశ విదేశాల్లో నివసించేవారు, వారి పిల్లల కోసం ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించాలి. భాష చనిపోతోందని బాధపడే ఆలోచన పక్కన పెట్టి భాషకు ఏం చేస్తున్నాం.. అనే ఆలోచన చేయాలి. - డాక్టర్ రవికుమార్ వేలూరి, వైద్యనిపుణుడు, అమెరికా ఒడిశాలో తెలుగు వెలగాలి ఒడిశాలో తెలుగువ్యాప్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందించాలి. అక్కడి తెలుగువారు తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించుకోవాలని తాపత్రయపడుతున్నారు. అయితే, అక్కడ తెలుగు బోధించే ఉపాధ్యాయులు ఉన్నా... పుస్తకాలు, తదితర సామగ్రి అందుబాటులో లేవు. ప్రభుత్వం స్పందించి ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారికి అండగా నిలవాలి. తెలుగు పాఠశాలలకు సహకారం అందించాలి. - సింహాద్రి శ్రీనివాసరావు, తెలుగు భాషోద్యమ నేత, ఒడిశా అలా చేస్తేనే మంచిరోజులు.. కాలచక్రంలో తెలుగు సంస్కృతి తగ్గిపోతోంది. ఎవరికివాళ్లు మన ఒక్కరి వల్లే తెలుగు బాగుపడుతుందా.. అనుకుని ఊరుకుంటే కష్టం. ప్రతి ఒక్క తెలుగువారు మాతృభాషాభివృద్ధికి కృషిచేయాలి. తెలుగుకు ప్రాధాన్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రపంచస్థాయిలో తెలుగు రచయితల మహాసభలు జరపడం చారిత్రక అవసరం. తెలుగును పాఠ్యాంశంగా చేయడం, కేవలం పాఠశాలల్లోనే కాకుండా డిగ్రీ. వృత్తి విద్యా కోర్సుల్లోనూ తప్పనిసరి చేయడం వంటి ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే తెలుగు భాషకు గౌరవం ఏర్పడుతుంది. ఇలాంటి పనులకు ప్రభుత్వం పూనుకుంటే తెలుగుకు మంచి రోజులొస్తాయి. - ఓల్గా, రచయిత్రి, హైదరాబాద్ బోధన తెలుగులోనే జరగాలి కార్పొరేట్ విద్యాసంస్థల్లోనూ తెలుగు బోధన జరిగినప్పుడే తెలుగు భాషా వికాసం సాధ్యమవుతుంది. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అద్భుతంగా జరిగాయి. అర్థవంతమైన సదస్సులు, సాహితీమూర్తుల ప్రసంగాలు అందరిలో భాషా వ్యాప్తిని కలిగించాయి. ప్రాథమిక పాఠశాలలోనే తెలుగు బీజం పడాలి. తెలుగు బోధన తప్పనిసరి చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం చట్టం చేయాలి. టెక్నో, ఇంటర్నేషనల్ వంటి పేర్లతో వచ్చే విద్యాసంస్థల్లో తెలుగు బోధన జరగాలంటే ప్రభుత్వం తలచుకోవాలి. తెలుగు భాషా వ్యాప్తికి నేను నా స్థాయిలో పాటుపడుతున్నాను. - గుమ్మడి గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, హైదరాబాద్ -
ఒకసారి అత్తరు ఒకసారి నెత్తురు
పెద్దవాళ్లు ఏమంటారంటే రచయితలు అలెర్ట్‌గా ఉండాలి అని. ఏమో ఎవరికి తెలుసు. ఏ కథ ఎటు జారిపోతుంటుందో ఎవరికి తెలుసు. ఏ కథ ఎటు మాయమైపోతుందో ఎవరికి తెలుసు. పట్టుకోవాలి. కొన్ని కథలు కొన్ని స్థలాల్లో మాత్రమే పుడతాయి. పట్టుకోవాలి. కొన్ని కథలు కొన్ని సమయాల్లో మాత్రమే పుడతాయి. పట్టుకోవాలి. ఉదాహరణ చూద్దాం. అక్తర్ మొహియుద్దీన్ ప్రఖ్యాత కాశ్మీరీ రచయిత. కాశ్మీరీ భాషను ఉపయోగించి మొదటిసారి నవల రాసింది ఆయనే అని అంటారు. ఇప్పటివాడు కాదు. కాశ్మీర్ అనేది ఒక అందమైన లోయగా, మంచుపువ్వుగా, పూలగుచ్ఛంగా ఉన్నప్పుడు మొదలయ్యాడు. 1958 నాటికే సాహిత్య అకాడెమీ అవార్డ్ వరించేంత గట్టి కృషి చేశాడు. అప్పట్లో ఆయన ఒక కథ రాశాడు. దర్జీ కథ. పేరు ‘పెళ్లికూతురి పైజామా’. ఏం లేదు. ఇద్దరు చాలా ముసలి భార్యాభర్తలు. భర్త దర్జీ పని చేస్తుంటాడు. భార్య అతనికి వంట చేసి పెడుతూ ఉంటుంది. వారికి కొంతమంది పిల్లలు. మగపిల్లలు ఏనాడో పోయారు. ఆడపిల్లలు బతికి బట్టకట్టారు. వాళ్లకు పెళ్లిళ్లయ్యాయి. అల్లుళ్లకు ముసలితనం కూడా వచ్చేస్తోంది. మరి ఈ ముసలివాళ్లు ఏం చేస్తుంటారు? రోజూ ఒకటే పని. అతను కూనిరాగం తీస్తూ రోజూ ఏదో బట్ట కుడతాడు. ఆమె తోడుగా ఉంటూ మసలుతూ ఉంటుంది. అంతే. ఒకరోజు ఆమెకు ఏమీ తోచక పాత బట్టలు మూటగడుతూ ఉంటే ఆమె పెళ్లినాటి పైజామా ఒకటి బయటపడుతుంది. ఎర్రటి పైజామా. అంచుల్లో చిన్న నగిషీ అల్లిక. నిఖారోజు దానిని తొడుక్కుందట. చేతుల్లోకి తీసుకోగానే సిగ్గు ముంచు కొచ్చింది. భర్త అది చూశాడు. పెళ్లినాటి రోజును ఎవరు మాత్రం మర్చిపోతారు గనక. ఆ ఎర్ర పైజామాను గుర్తుపట్టాడు. ఏనాటి సరసమో... ఆ క్షణాన ఉబికి వచ్చింది. ఒకసారి వేసుకొని చూపించవా అన్నాడు. ఆమె సిగ్గుపడింది. ఉత్తుత్తి కోపానికి పోయింది. నా వల్ల కాదు బాబూ అని తల అడ్డంగా ఊపింది. ఊహూ. అతను వినలేదు. ఆమెను ఉత్సాహపరచడానికి హుషారుగా బజారుకు వెళ్లి మాంసం కొనుక్కు వచ్చాడు. కూనిరాగం మరికాస్త అందంగా అందుకున్నాడు. ఇక ఆమె పైజామా తొడుక్కుని తీరవలసిందే. తొడుక్కుంది. పండు ముసలి వయసులో మరోసారి పెళ్లికూతురిలా మారి సిగ్గుల మొగ్గయ్యి తల దించుకుంది. భర్త చాలా సంతోషపడ్డాడు. దగ్గరగా వచ్చి ఆమెను హత్తుకొని ఎత్తుకొని తిప్పినంత పని చేశాడు. ఎంత మంచి క్షణాలు అవి. ముసలితనాన్ని మాయం చేసి నవ ఉత్సాహాన్ని ఇచ్చిన క్షణాలు. ఇంతలో ఎవరో వచ్చారు. చూస్తే అల్లుడుగారు. అమ్మో అతనుగాని చూస్తే? ఆమె కంగారు పడింది. భర్త లెక్క చేయలేదు. చూస్తే ఏమిటోయ్? మనింటికి మనమే రాజు అని హాయిగా మరోసారి హత్తుకున్నాడు. కథ ముగిసింది. ఏమీ లేదనుకుంటాము కానీ ఏ క్షణంలో అయినా జీవితం ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. లేకుంటే మనుషులు ఎప్పుడో పోయేవారు. అలాగే ఏ క్షణంలో అయినా ప్రేమ ఎంతో కొంత మిగిలే ఉంటుంది. లేకుంటే కూడా మనుషులు ఎప్పుడో రాలిపోయుండేవారు. భారీ టెండరు సాధించుకోవడమే ఆనందం అనకుంటారు కొందరు. భార్య ఎప్పటిదో పైజామాను ఒకసారి వేసుకొని కనిపించడం కూడా ఆనందమే అనుకుంటారు మరికొందరు. ఏం కథ ఇది! కాని 2000 సంవత్సరంలో నేనొక దర్జీ కథ రాయాలనుకున్నప్పుడు ఇలాంటి ఆనందాలు నాకు కనపడలేదు. నేను చూడలేదు. నేను చూసింది వేరే. చినచేపను పెద చేప. మార్కెట్ ఏం చేస్తుందంటే ఒక బ్రాండ్‌ను సృష్టిస్తుంది. తర్వాత జనాన్ని ఆ బ్రాండ్‌కు బానిసలను చేస్తుంది. రెడీమేడ్ దుస్తుల తుఫాను కమ్ముకుంటున్న కాలంలో సొంతంగా బతుకుదామనుకునే ఒక సాధారణ దర్జీ జీవితంలో ప్రేమకు తావు లేదు. సంక్షోభానికి తప్ప. ఆ సంక్షోభమే నాకు కనిపించింది. అదే ‘న్యూ బాంబే టైలర్స్’ కథ అయ్యింది. వస్తువు ఒక్కటే. కాని స్థలం మారింది. కాలం మారింది. దాంతో కథ కూడా మారింది. మరైతే ఏమిటి? అక్తర్ మొహియుద్దీన్ ఆ తర్వాత కూడా ‘పెళ్లికూతురి పైజామా’ వంటి కథలే రాశాడా? స్థలం అలాగే ఉండి కాలం మారితే ఏమవుతుందో తెలుసా? 1990లో అక్తర్ మొహియుద్దీన్ స్వయంగా తన కొడుకునూ, అల్లుణ్ణి కాశ్మీర్ హింసలో కోల్పోయాడు. ఆ దుఃఖంతో ‘ప్రత్యేక కాశ్మీర్’ను డిమాండ్ చేసే హురియత్ కాన్ఫరెన్స్‌లో చేరాడు. ఉద్యమకారుడిగా మారాడు. కాశ్మీర్‌లోయ కల్లోలలోయగా మారడాన్నే తన కథా వస్తువుగా చేసుకున్నాడు. అప్పుడిక అతడి కథల్లో ముసలి భార్యాభర్తల సరదా సంతోషాలకు తావు ఉండదు. ఒక రచయిత మీద స్థలకాలాలు చూపే మహిమ అలా ఉంటుంది. అవి ఒక్కోసారి రచయితను పిండి అత్తరు తీస్తాయి. మరోసారి నెత్తురు. అదిగో ఈ రెండు సందర్భాల్లోనూ వివశులైన వాళ్లే ఆ వివశత్వాన్ని భరించలేక కథలు రాస్తుంటారు. రాసి వ్యక్తమవుతూ ఉంటారు. - ఖదీర్