టేన్ షన్
పూర్తి కాని పదోతరగతి సిలబస్
కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కరువు
ఆందోళనలో విద్యార్థులు
చిత్తూరు(గిరింపేట): ప్రతి విద్యార్థి జీవితంలో కీలకఘట్టం పదోతరగతి. అక్కడ గట్టెక్కితే కొండంత ఆత్మవిశ్వాసం వస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పదో తరగతి విద్యార్థులకు.. జిల్లాలో చాలాచోట్ల టీచర్లు లేరు. కనీసం విద్యావలంటీర్లను కూడా నియమించక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ పరీక్షలకు మరో రెండు నెలలే గడువుంది. కీలక సబ్జెక్టులకు టీచర్లు లేకపోవడంతో పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు దృష్టిసారించకపోవడం దారుణమని ఉపాధ్యాయసంఘాలు చెబుతున్నాయి. జిల్లాలో 534 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో 28 వేల మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. విద్యాశాఖ లెక్కల ప్రకారం పదో తరగతికి సంబంధించి 386 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. కీలక సబ్జెక్టులైన ఇంగ్లీషు, గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, సాంఘికశాస్త్రానికి టీచర్లే లేరు. నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక సబ్జెక్టు టీచరు ఉండాలి. ఈ స్థాయిలో ఎక్కడా నియామకాలు జరగలేదు.
నెలాఖరువరకే గడువు..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నె లాఖరుకు పదోతరగతి సిలబస్ మొత్తం పూర్తి కావాలి. కానీ ఉపాధ్యాయుల కొరత వల్ల కొన్నిచోట్ల 80 శాతం, మరికొన్ని చోట్ల 50 నుంచి 60 శాతం పాఠ్యాంశాలు మాత్రమే పూర్తయ్యాయి. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉన్న వారితోనే తరగతులు నిర్వహిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఉన్నత పాఠశాలల్లో బోధించే టీచర్లు వేరే ప్రాంతాలకు బదిలీ కావడం వల్ల ఆ స్థానాలు ఖాళీ అయ్యాయని చెబుతున్నారు. విద్యాశాఖాధికారులు కుప్పం మండలానికి మాత్రం వలంటీర్లను నియమించి జిల్లాలోని మిగిలిన మండలాల్లోని పాఠశాలలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సక్సెస్‌లో మరీ అధ్వానం
జిల్లాలో 339 సక్సెస్ పాఠశాలల్లో ప్రత్యేక సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయులే లేరు. ఆ పాఠశాలల్లో ఈ ఏడాది 27 వేల మంది విద్యార్థులు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఆంగ్ల మాధమ్యం చెప్పే వారు లేక తెలుగు మీడియం వారితోనే బండిలాకొస్తున్నారు.
ఇదిగో సాక్ష్యం..
పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో తమిళ్ ల్వాంగేజ్ బోధించడానికి ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మరొక ప్రాంతానికి బదిలీ అయినప్పటి నుంచి ఆ సబ్జెక్ట్‌కు వేరొక ఉపాధ్యాయున్ని నియమించ లేదు. గుడిపాల మండలంలోని మిట్టఇండ్లు, ఏఎల్‌పురంలో సోషియల్, బయాలజీ బోధించే టీచర్లు లేరు. యాదమరి మండలంలోని 14 కండ్రిగ ఉర్ధూ ఉన్నతపాఠశాలలో భౌతిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడి పోస్టు ఖాళీ. పీటీఎం మండలంలోని కందుకూరు జడ్పీ హైస్కూల్‌లో గణితం, హిందీ, పీటీయంలోని ఉన్నత పాఠశాలలో బయాలజీ, సోషియల్ సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులే తమ సొంత డబ్బులతో వలంటీర్లను నియమించుకుని బోధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
రాష్ట్ర అధికారులకు నివేదిక పంపాం
జిల్లాలో ఉన్న ఉపాధ్యాయు పోస్టులకు సంబంధించిన ఖాళీల జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపాం. వారి నుంచి అదేశాలు వచ్చిన తర్వాత ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక సర్ధుబాటు చేయడం జరుగుతుంది. వారంలోపు ఖాళీగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు యత్నిస్తాం.
- నాగేశ్వరరావు, డీఈవో