అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : అనంతపురంలో ఆదివారం నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 19,298 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వీరిలో ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు జరగనున్న పేపర్-1 పరీక్షకు 3420 మంది, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరగనున్న పేపర్-2 పరీక్షకు 15,578 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్-1కు 16 కేంద్రాలు, పేపర్-2కు 68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1, 2కు కలిపి మొత్తం 84 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 84 మంది డిపార్టుమెంటల్ అధికారులను నియమించారు.
నిమిషం ఆలస్యమైనా నోఎంట్రీ
పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించొద్దని డీఈఓ మధుసూదన్‌రావు స్పష్టం చేశారు. శనివారం అనంతపురంలోని కేఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు అర్ధ గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాతనే అనుమతించాలని తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ ఏడీ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనరు గోవిందునాయక్ పాల్గొన్నారు.
54 మంది డమ్మీ అభ్యర్థుల గుర్తింపు!
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో నెగ్గేందుకు కొందరు అభ్యర్థులు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు చేసుకుని డమ్మీ అభ్యర్థుల తో పరీక్ష రాయించడానికి వ్యూహం రూపొందించారు. అసలు అభ్యర్థి ఒక చోట, డమ్మీ అభ్యర్థులు ఇతర కేంద్రాల్లో పరీక్ష రాస్తారు. వీరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినా ఆ అభ్యర్థి పాస్ అయినట్లే.
జిల్లాలో 54 మంది అభ్యర్థులు ఒకే పేరుతో రెండు మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర అధికారులు పరిశీలనలో గుర్తించారు. ఈ జాబితాను జిల్లా విద్యాశాఖకు పంపడంతో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. హాల్ టికెట్‌పై ఫొటో స్పష్టంగా ఉండదు. ఈ అవకాశాన్ని తీసుకుని అభ్యర్థులు మోసాలకు తెరతీశారు. పరీక్ష కేంద్రంలో సిబ్బంది కూడా హాల్ టికెట్లు క్షు ణ్ణంగా పరిశీలించకపోతే వారిని గుర్తించలేరు.
ప్రత్యేక నిఘా ఉంచాం : డీఈఓ
జిల్లాలో 54 మంది అభ్యర్థులు 2-3 సార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తేలిందని డీఈఓ తెలిపారు. ఈ జాబితాను పరీక్ష కేంద్రాలకు పంపామని, నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఎవరైనా డమ్మీ అభ్యర్థులు రాస్తే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నేడే టెట్
Published Sun, Mar 16 2014 3:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement