- కృష్ణా కరకట్టకు వాహనాల తాకిడి
- వాహనాల వేగం కారణంగా ప్రమాదాలు
తోట్లవల్లూరు, న్యూస్‌లైన్: కృష్ణానది కరకట్టపై పలువురు వాహనదారులు క్షణక్షణం భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తుండ టంతో ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలనే వారి ఆతృత ప్రమాదాలకు కారణమై నిండు ప్రాణాలను బలిగొంటోంది. విజయవాడ-పులిగడ్డ మధ్యలో కృష్ణానది కరకట్ట అభివృద్ధికి దివంగత మఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై. ఎస్.రాజశేఖరరెడ్డి రూ.138 కోట్ల వ్యయంతో పనులకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. విజయవాడ-దివిసీమ మధ్య దూరాన్ని తగ్గించి, వాహనా ల రాకపోకలకు అనుగుణంగా ఉండే విధంగా కరకట్టను డబుల్‌రోడ్డుగా అభివృద్ధి చేశారు.
విస్తరణతో పెరిగిన రద్దీ
కరకట్టను విస్తరించి తారురోడ్డుగా అభివృద్ధి చేయటంతో ఇటీవల వాహనాల తాకిడి మరీ ఎక్కువైంది. ప్రయాణానికి ఈ మార్గం అనుకూలంగా ఉండటంతో దివిసీమలోని ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య వర్గాలవారు అధికసంఖ్యలో నిత్యం దీనిపై రాకపోకలు సాగిస్తున్నారు. ప్ర యాణ సమయం బాగా కలిసి రావటంతో పా టు ఇంధనం కూడా ఆదా అవుతోందని వాహనదారులు అంటున్నారు.
నిత్యం ప్రమాదాలు
కరకట్టపై ఇటీవల ప్రమాదాలు ఎక్కువయ్యా యి. కొందరు వాహనాలను నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో నడుపుతుండటంతో ఈ మార్గంలో రోజూ ఏదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది. మండలంలోని రొయ్యూరు- ఐలూరు మధ్య సుమారు 18 కిలోమీటర్ల మేర కరకట్ట విస్తరించి ఉంది. రోడ్డు విశాలంగా ఉండటంతో కొందరు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. దీంతో అవి అదుపుతప్పి వాటి లో ప్రయాణించేవారు ప్రమాదాల బారిన పడుతున్నారు.
గత నెల 24వ తేదీ రాత్రి గుంటూరు నుంచి అవనిగడ్డకు కారులో ఓ కుటుంబం వెళ్తోంది. గురివిందపల్లి లాకుల సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని కలగలేదు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో దేవరపల్లికి చెందిన పోస్టుమేన్ పాములపాటి రామచంద్రయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ఈ మార్గంలో జరిగే ప్రమాదాల్లో కొన్ని మాత్రమే పోలీసుల దృష్టికి వస్తున్నాయి. చిన్నచిన్న ప్రమాదాల గురించి వారికి సమాచా రం అందడంలేదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కరకట్టపై ప్రయాణించేవారు వేగాన్ని అదుపులో ఉంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపేవారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.